సిరా న్యూస్, ఆదిలాబాద్
రైతులపై లాఠీచార్జ్ అబద్ధం: ఎస్పీ గౌస్ ఆలం
* తోపులాట జరగకుండానే పోలీసు బందోబస్తు ఏర్పాటు
* అవస్తవ వార్తలు ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతులపై పోలీసులు ఎటువంటి లాఠీ చార్జ్ జరపలేదని ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు.రైతుల తోపులాట జరగకుండా క్రమబద్ధీకరించడం కోసం పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు.ఆదిలాబాద్ లో పత్తి విత్తనాల కొనుగోలు కోసం దుకాణాల వద్దకు వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకున్నారని, చదరగొట్టారన్నది అవాస్తవమని తెలిపారు. రైతుల బాగు కోసం ఎటువంటి అపాయం జరగకుండా చూస్తున్నామని, వారి క్షేమం కోసం సదుద్దేశంతో రైతులందరిని ఒక క్రమబద్ధీకరణతో వరుస క్రమంలో ఏర్పాటు చేయడం కోసమే పోలీసు సిబ్బంది బందోబస్తు విధులను నిర్వహిస్తున్నారని తెలిపారు. దుకాణాల్లోకి దూసుకెళ్లకుండా ప్రశాంతంగా రైతులను క్రమబద్ధీకరణలో వరుస క్రమంలో విత్తనాలను సేకరించి తిరిగి వెళుతున్నారని తెలిపారు. ఎటువంటి ఆందోళనకర పరిస్థితులు ఆదిలాబాద్ లో ఏర్పడలేదని తెలిపారు. రైతులతో తీవ్ర వాగ్వాదం, తోపులాట అనేది జరగలేదని చెప్పారు. పోలీసులు ఏ రైతుపై కూడా లాఠీచార్జ్ చేయలేదని తెలిపారు. ఇలాంటి ఆందోళనకర అవాస్తవమైన, వార్తలను ప్రచురించి ప్రశాంతమైన రైతులకు ఇబ్బందికర పరిస్థితిని తీసుకురాకూడదని సూచించారు. అవస్తవమైన వార్తలను,స్క్రోలింగ్ లను ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.