సిరా న్యూస్,విశాఖపట్టణం;
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు విజయం సాధించారు. యాజమాన్యం కార్మికుల ఒత్తడికి దిగొచ్చింది. కాంట్రాక్టు కార్మికులను తిరిగి కొనసాగించేందుకు అంగీకరించింది. ఈ మేరకు లేబర్ కమిషనర్ సమక్షంలో ఒప్పందం జరిగింది. సెప్టెంబర్ లో4,200 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తెలిగించాలని నిర్ణయించిన యాజమాన్యం ఇప్పుడు తిరిగి వారిని విధుల్లోకి తీసుకుంది. కార్మికుల విజయం ఐక్యంగా పోరాడిన విశాఖ ఉక్కు కార్మికులు కీలక విజయం సాధించారు. ప్రైవేటీకరణలో భాగంగా కాంట్రాక్టు కార్మికులను భారీగా తగ్గించడానికి యాజమాన్యం చేసిన కుట్రను అడ్డుకున్నారు. కార్మికుల ఆందోళన మరింత తీవ్రమయ్యే సంకేతాలు కనిపించడంతో యాజమాన్యం దిగివచ్చింది. కార్మిక సంఘాలతో చర్చలకు సిద్ధపడింది. అందరినీ విధుల్లో కొనసాగిస్తామని లేబర్ కమిషనర్ సమక్షంలో రాతపూర్వకంగా ఒప్పుకుంది. దీంతో కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.ఇదే స్ఫూర్తితో ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, సెయిల్‌లో విలీనాన్ని సాధిస్తామని కార్మికసంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రకటించాయి. కార్మికుల ఆందోళనలు పెద్దఎత్తున జరుగుతుండటంతో కార్మిక సంఘాలను యాజమాన్యం చర్చలకు పిలవక తప్పనిస్థితి ఏర్పడింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ లేబర్ కమిషనర్ సమక్షంలో స్టీల్‌ప్లాంట్ యాజమాన్యానికి, కాంట్రాక్టు కార్మిక సంఘాలకు మధ్య సుదీర్ఘ చర్చలు నడిచాయి. చివరకు దిగివచ్చిన యాజమాన్యం ప్రస్తుతానికి కాంట్రాక్టు కార్మికులను ఎవరినీ తొలగించబోమని, ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో తొలగించిన 3700 మంది కాంట్రాక్టు కార్మికుల లేబర్ పాస్‌లను తిరిగి పునరుద్ధరిస్తామని, అలాగే సిస్టంలో బయోమెట్రిక్ డేటాబేస్‌ను కూడా పునరుద్ధరిస్తామని చెప్పింది. పాత పద్ధతిలోనే గేట్ పాస్‌లను కొనసాగించడానికి అంగీకరించింది. కార్మికులకు హామీ ఏడు రోజులలో అన్‌లైన్‌లో పునరుద్ధరణ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపింది. ఈ చర్చల సందర్బంగా కార్మిక నేతలు మాట్లాడుతూ ఎవరికి అన్యాయం జరిగినా ఊరుకోబోమన్నారు. లేబర్ కమిషనర్ మహంతి మాట్లాడుతూ కార్మికుల ఉపాధి పరిరక్షణ, స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి పెంపుదల వంటి అంశాలపై యాజమాన్యం దృష్టి సారించాలన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని, సొంతగనులు కేటాయించాలని, ప్రైవేటీకరణ విధానాలు మానుకోకపోతే తెలుగోడి సత్తా చూపుతామని కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాల జెఎసి చేపట్టిన దీక్షల్లో భాగంగా జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద దీక్షలు కొనసాగాయి.