విద్యార్థులకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం, వివి ప్యాట్ లపై అవగాహన
సిరా న్యూస్,పెద్దపల్లి;
జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మ్యూజియంను మండలంలోని పెద్దకల్వల నోబెల్ హై స్కూల్ కు చెందిన విద్యార్థిని, విద్యార్థులు సందర్శించారు. జిల్లా కలెక్టరేట్ లో జిల్లా సాంస్కృతిక చరిత్రను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన మ్యూజియంను నోబెల్ హై స్కూల్ ఫీల్డ్ విజిట్ లో భాగంగా స్వచ్ఛందంగా విచ్చేసి సందర్శించారు. ఈ సందర్భంగా మ్యూజియంలో ప్రదర్శించిన జిల్లా సాంస్కృతిక చరిత్రను అధికారులు విద్యార్థులకు వివరించారు. మౌర్యుల కాలంలో పర్యటించిన విదేశీ యాత్రికుడు మెగస్తనీసు పేర్కొన్న 30 దుర్గాలలో 3 దుర్గాలు కదంబపూర్, ధూళికట్ట, పెద్దబోంకూర్ వేదికగా జిల్లాలో ఉన్నాయని, శాతవాహనుల రాజధాని కోటిలింగాలలో లభించిన నాణాలు పెద్దబొంకూర్, దూళికట్టలో కూడా దొరికాయని విద్యార్థులకు వివరించారు. జిల్లాలోని ప్రముఖమైన ప్రదేశాల వివరాలను, వాటి చిత్రపటాలను విద్యార్థులకు తెలియజేశారు. 25 వందల సంవత్సరాల క్రితం నాటి శాతవాహన కాలానికి చెందిన నాణేలు, క్రీస్తు శకం నాల్గవ శతాబ్దం నుంచి ఆరవ శతాబ్దం వరకు తేలుకుంట గ్రామం వద్ద లభించిన విష్ణు కుండినుల నాణాలు, బ్రిటిషర్లు భారత దేశాన్ని పరిపాలించే సమయంలో విడుదల చేసిన నాణేలను విద్యార్థులకు చూపిస్తూ, అప్పటి సాంస్కృతిక, సామాజిక పరిస్థితులను వివరించారు. అనంతరం సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం, వివి ప్యాట్ ద్వారా ఎన్నికల్లో ఓటు వేసే విధానాన్ని, ఎన్నికలలో మనకు నచ్చిన అభ్యర్థి పేరు పక్కన ఉన్న బటన్ నొక్కగానే సౌండ్ వస్తుందని, వివి ప్యాట్ స్క్రీన్ పై మనం ఓటు వేసిన అభ్యర్థి పేరు చిహ్నంతో కూడిన స్లిప్పు కొన్ని సెకండ్ల పాటు కనిపించి డబ్బాలో స్టోర్ అవుతుందని కలెక్టరేట్ సిబ్బంది విజయ్ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో నోబెల్ హై స్కూల్ ఉపాధ్యాయు లు బెజ్జంకి రాధిక, విద్యార్థిని, విద్యార్థులు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.