swarupa: కూతుళ్ల భవిష్యత్ కు స్వ”రూపం”

సిరాన్యూస్‌, ముల్కనూర్
కూతుళ్ల భవిష్యత్ కు స్వ”రూపం”
* భర్త మరణంతో బతుకు భారం..
* స్వరూప తెగువే కుటుంబ పోషణ.. నలుగురికీ ఉపాధి..
* మ‌హిళ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌త్యేక క‌థ‌నం..
కష్టపడే తపన సాధించాలనే సంకల్పం ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలం.. అసాధ్యాలను కూడా సుసాధ్యాలుగా మార్చుకోవడమే కాదు కష్టాల కడలి నుండి గట్టెక్కగలం అని నిరూపిస్తూ.. తన కూతుళ్ళ భవిష్యత్తునే లక్ష్యంగా మార్చుకొని, చలువ పందిళ్ళు వేస్తూ, ఫ్లెక్సీలు కడుతూ… కష్టపడితే ఏదైనా జయించగలం.. కుటుంబాన్ని పోషించగలం అంటూ నిరూపించింది ముల్కనూర్ కు చెందిన మసున స్వరూప. కట్టుకున్నవాడు.. కాటికి చేరడంతో, ఇంట్లో ఆర్థిక పరిస్థితుల మూలాన, తన పిల్లల చదువులు మధ్యలోనే ఆపేసే పరిస్థితి రాకూడదని స్వయంకృషితో తన కుటుంబాన్ని పోషించుకుంటున్న స్వరూప జీవిత గాథ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాటల్లోనే.. “నా పేరు మసున స్వరూప నా భర్త పేరు శ్రీనివాస్, మాకు ఇద్దరు ఆడపిల్లలు అనుష్క, అక్షయ. పెద్దమ్మాయి ఇంటర్ చదువుతుంది, రెండవ అమ్మాయి మూడవ తరగతి చదువుతుంది. మా సొంత గ్రామం ముల్కనూర్, మాది పేద కుటుంబం. నా భర్త మూడేళ్ల క్రితం పాముకాటు తో చనిపోయాడు. దీంతో కుటుంబ భారం నాపై పడింది. పిల్లలను పోషించడంతో పాటు వారికి చదువు, బట్టలు కొనుగోలు ఇబ్బందిగా మారింది. మా ఆయన చనిపోయిన దగ్గర నుండి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో కుటుంబ పోషణ కోసం ఏదో ఒకటి చేయాలని సంకల్పించి, ముల్కనూరులో ఫ్లెక్సీలు కట్టడం,చలువ పందిళ్ళు వేయడం మొదలుపెట్టాను”. భర్త అకాల మరణం, కళ్ల ముందు ఎదిగిన పిల్లలు, చేయూత అందించే చేతులు లేవు.. తన స్వశక్తినే నమ్ముకున్న స్వరూప జీవన పోరాటంలో తనకున్న ఆటో లో కర్రలు, తడకలు వేసుకొని చలువ పందిళ్లు కడుతూ తనతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తూ మహిళ లోకానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఉన్నత చదువులు లేకపోయినా, ఇద్దరు బిడ్డలను ఉన్నత స్థానాలకు చేర్చేందుకు తాను పడుతున్న కష్టం,ఆమె జీవితంలో ముందుకు సాగుతున్న తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన పిల్లల చదువు కోసం, ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి సాయం చేయాలని కోరుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *