సిరాన్యూస్, చర్ల
అర్హతకు మించి వైద్యం చేయొద్దు : టీఏజీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కారం నరేష్
* రక్త పరీక్షల పేరుతో నిరుపేదలను దోచుకోవద్దు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కొంతమంది ఆర్ఎంపీలు అర్హతకు మించి వైద్యం చేస్తున్నారని, మిడిమిడి జ్ఞానంతో వైద్యం చేసి సామాన్యులను హత్య చేస్తున్నారని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి విమర్శించారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఏజీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కారం నరేష్ మాట్లాడారు. మండల వ్యాప్తంగా కొంతమంది మెడికల్ స్టోర్ యజమానులు ఆర్ఎంపీలుగా అవతారం ఎత్తి వైద్యం చేస్తున్నారని, పేద ప్రజల దగ్గర మందుల పేరుతో దానర్జన కోసం అవసరం లేని మందులు కొనాలని లేకపోతే వైద్యం ఎలా చేయాలని హుంకు ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. దీనితో నిరుపేద ప్రజలు వైద్యం కొరకు వచ్చి జేబు కాళీ చేసుకుంటున్నారని గ్రామీణ వైద్యులు సరైన వైద్యం చేయక బలవుతున్నారని ఆరోపించారు. ఏడాది కాలంలో మండలంలో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారని, ప్రభుత్వ అధికారులు సైతం నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తున్నారన్నారు.గతంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు సీజ్ చేసిన వాటిని మరలా వారం లోపు అనుమతులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు.అదే కాకుండా రోజుకొక ప్రైవేట్ క్లినిక్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని , వాటిపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరారు.