తాండూరు కందిపప్పు రికార్డు

సిరా న్యూస్,హైదరాబాద్;
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన కనీసంగా మద్దతు ధర పలకడమే ప్రసుత్తం గగనం. అలాంటిది ఇప్పుడు కంది పండించిన రైతులకు ఈ సీజన్లో అనుకోని రీతిలో కనక వర్షం కురిసినట్లయింది. రాష్ట్రంలోని అన్ని మార్కెట్‌లలోకెల్లా తాండూరులోనే కందికి రికార్డు ధర పలకింది. తాండూరు వ్యవసాయ మార్కెట్‌లో ఈ ఏడాదిలోనే అత్యధిక ధర పలికింది. నాణ్యతగల కందులు క్వింటాలుకు రూ.11,007 ధర చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ ఏడాదికి ఇదే అత్యధిక ధర అని రైతులు, మార్కెట్ శాఖాధికారులు అధికారులు చెబుతున్నారు.తాండూరు మార్కెట్‌కు రైతులు మెుత్తం 752 క్వింటాళ్లను తీసుకరాగ ఇందులో నాణ్యత గల కందులను వ్యాపారులు రూ.11,007 ధర చెల్లించి కొనుగోలు చేశారు. నాసిరకంగా ఉన్న కందులకు రూ.8,811 చొప్పున, నాణ్యతకు కాస్త అటూ ఇటుగా ఉన్న కందులకు రూ.10,125 చొప్పున వ్యాపారులు చెల్లించారు. ఇక కేంద్ర ప్రభుత్వం క్వింటాలు కందులకు రూ.7000 మద్దతు ధర ప్రకటించింది. అయితే వ్యాపారులు మాత్రం మద్దతు ధర వద్ద రూ.1,811 నుంచి రూ.4,007 అధికంగా చెల్లించటం విశేషం. జనగాం మార్కెట్‌లో కందులకు కనిష్ఠ ధర రూ.6,813 పలకగా.. సూర్యాపేటలో రూ.4,259, వరంగల్‌లో రూ.3,659 చొప్పున పలికిందని అధికారులు వెల్లడించారు.కందిపప్పుకు తాండూరు ప్రసిద్ధి చెందిన ప్రాంతం గా పేరొందింది. దక్షిణ భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా తాండూర్‌ బ్రాండ్‌ కందిపప్పు హాట్‌ కేక్‌లాగా అమ్ముడు పోతుంది. ఇక్కడ పండే కందుల్లో పోషకాలు అధికంగా ఉంటాయని, అలాగే ఎక్కడా లేని విధంగా రుచి ఉంటుందని చెబుతారు. దీని ప్రాధాన్యతను గుర్తించి తాండూరు కందికి భౌగోళిక గుర్తింపు కూడా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *