సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణం పై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. దీంతో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ బిఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. అప్పటినుంచి టీటీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఏపీ ఎన్నికలతో బిజీగా ఉండడంతో చంద్రబాబు భర్తీ చేయలేకపోయారు.ఇప్పుడు ఏపీలో పార్టీ అధికారంలో రావడంతో తెలంగాణలో పావులు కదపడం ప్రారంభించారు. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ తో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు విభజన సమస్యలపై చర్చించారు. చర్చలు సానుకూలంగా కొనసాగాయి.గతం మాదిరిగా చంద్రబాబుతెలంగాణ సమాజంలో వ్యతిరేకత తగ్గింది. అందుకే పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టారు టిడిపి అధినేత చంద్రబాబుతెలుగుదేశం పార్టీపై ఏపీ ముద్ర వేయడంలో సక్సెస్ అయ్యారు కెసిఆర్. ఆంధ్రా పార్టీగా అభివర్ణిస్తూ దాని మూలాలను తెలంగాణలో దెబ్బతీశారు. టిడిపిలోని నాయకత్వాన్ని, క్యాడర్ ను తీసుకున్నారు. అయితే టిడిపి పట్ల చెక్కుచెదరని అభిమానం కూడా ఉంది. ఇప్పటికీ నాలుగు నుంచి ఐదు శాతం సాలిడ్ ఓటు బ్యాంకు తెలుగుదేశం పార్టీకి ఉంది. గ్రేటర్ హైదరాబాదులో సైతం ఆ పార్టీకి బలం ఉంది. అందుకే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. హైదరాబాద్ తో పాటు ఖమ్మంలో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. దీంతో పార్టీ యాక్టివ్ అయ్యింది. కాసాని జ్ఞానేశ్వర్ ను టిడిపిలోకి తీసుకుని నాయకత్వ బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. ఆయన చాలా బాగా పనిచేస్తూ ముందుకు సాగారు. బిజెపితో పొత్తు పెట్టుకోవడం ద్వారా కొన్ని స్థానాలు కైవసం చేసుకోవాలని చంద్రబాబు ఆలోచన చేశారు.తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సమయంలో చంద్రబాబు అవినీతి కేసుల్లో చిక్కుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. బెయిల్ దక్కకపోవడంతో 52 రోజులు పాటు జైల్లో ఉండి పోవాల్సి వచ్చింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయంతో విభేదించిన కాసాని జ్ఞానేశ్వర్ టిడిపిని విడిచిపెట్టారు. బిఆర్ఎస్లో చేరారు.నాడు బిజెపి విన్నపం మేరకు తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదని టాక్ నడిచింది. అదే సమయంలో టిడిపి క్యాడర్ కాంగ్రెస్ గొడుగు కిందకు చేరింది. తెలంగాణలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. తెలుగుదేశం పార్టీని తొక్కి పెట్టిన కేసీఆర్ అధికారానికి దూరమయ్యారు. ఆ పార్టీ రోజురోజుకు బలహీనమవుతూ వస్తోంది. దీనిని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు చంద్రబాబు. దూరమైన పార్టీ నేతలను టిడిపిలోకి రప్పించి యాక్టివ్ చేయాలని భావిస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ చంద్రబాబు నివాసం నుంచి టిడిపి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. చంద్రబాబు నాలుగో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అడుగుపెట్టనున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈరోజు తెలంగాణ టిడిపి విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలను భర్తీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణలో పార్టీ అభివృద్ధిపై ఫోకస్ పెట్టేందుకు చంద్రబాబు ప్రత్యేక వ్యూహరచనతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.