టీడీపీ ఆపరేషన్ గుడివాడ …

సిరా న్యూస్,విజయవాడ;
గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకమైంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ స్వస్థలమైన ఆ సెగ్మెంట్‌పై తిరిగి పట్టు సాధించిన టీడీపీ దాన్ని మరింత బిగించేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. 1983లో ఎన్టీఆర్ గుడివాడ నుంచి గెలిచిన నాటి నుంచి మధ్యలో ఒక్క 1989 ఎన్నికలు మినహా 2009 వరకు అక్కడ టీడీపీ జెండానే ఎగురుతూ వచ్చింది. 2004 లో తొలిసారి టీడీపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని 2009లో రెండోసారి కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే గానే అసెంబ్లీలో అడుగుపెట్టారు. తర్వాత పార్టీ మారి టీడీపీ రెబల్ అవతారమెత్తారు. వైసీపీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున వరుసగా గెలిచిన కొడాలి నాని.. గుడివాడ నాని అనిపించుకున్నారు.గుడివాడలో కొడాలి నాని తనదైన శైలిలో ముందుకు వెళ్లడం.. అంతే కాకుండా చంద్రబాబు, లోకేష్ టార్గెట్‌గా ప్రయోగించిన బూతుపురాణం టీడీపీ అధిష్టానానికి మింగుడుపడని వ్యవహారంగా మారింది. కొడాలి నాని అటు చంద్రబాబు, లోకేశ్‌లతో పాటు పవన్‌కళ్యాణ్‌లను వ్యక్తిగతం దూషిస్తూ, ప్రదర్శించిన దూకుడుతో తెలుగుదేశం పెద్దలు కూడా గుడివాడను సీరియస్‌గా తీసుకున్నారు. అక్కడ కొడాలిని ఓడించటం సాధ్యం కాదన్న పరిస్థితిని మార్చేసి ఆయన్ని ఓడించడం ద్వారా ఫస్ట్ టాస్క్ పూర్తి చేశారు.అయితే ఇక్కడితో ముగిసి పోలేదని తదుపరి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లుగా తెలుస్తోంది. కొడాలి నానిని ఓడించడం కోసం కళ్ళు కాయల కాసేలా ఎదురుచూసి గత ఎన్నికల్లో ఆ లక్ష్యాన్ని సాధించింది టీడీపీ.. ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్నారై వెనిగండ్ల రాము అండ్ టీం రెండేళ్ల పాటు చేసిన గ్రౌండ్ వర్క్‌తో పాటు వైసీపీ వ్యతిరేకత కూడా టీడీపీకి కలిసి వచ్చింది. కొడాలి నాని ఓడిపోవడంతో ప్రస్తుతం గుడివాడ వైసీపీ క్యాడర్ కూడా సైలెంట్ అయింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ అప్పుడు వైసీపీ నుంచి గెలిచిన కొడాలి నాని వర్గం దూకుడుగానే వ్యవహరించింది.ఇప్పుడా పరిస్థితి గుడివాడలో కనపడటం లేదు. కొడాలి నాని కూడా గుడివాడలో ఎక్కువగా అందుబాటులో ఉండకపోవడంతో ఆయన వర్గంతో పాటు వైసీపీ క్యాడర్ డైలామాలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నియోజకవర్గ, మండల స్థాయి నేతలు టీడీపీ బాట పడుతున్నారు. ఆ క్రమంలో టీడీపీ నాయకత్వం కూడా గుడివాడలో వైసీపీనీ పూర్తిగా ఖాళీ చేయించడానికి ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అందుకు గుడివాడ మున్సిపల్ ఎన్నికలు ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు లోకల్ గా పెద్ద చర్చ నడుస్తుంది.గతంలో అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగినా కొన్ని న్యాయపరమైన చిక్కుల కారణంగా గుడివాడలో జరగలేదు. దీంతో రెండు లేదా మూడు నెలల్లో గుడివాడ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించే అవకాశముందంటున్నారు. ఆ ఎన్నికల్లోవైసీపీ తరఫున ఎవరు పోటీ చేయకుండా నోటిఫికేషన్ సమయానికి అంతా టీడీపీలో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా మున్సిపల్ ఎన్నికలు కొడాలి నాని పర్యవేక్షణలో జరగగా ఈసారి ఆయన ఎంతవరకు యాక్టివ్ పార్ట్ తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ మళ్లీ ఆయన క్రియాశీలకంగా మారాలనుకున్నా.. వైసీపీని పూర్తిగా ఖాళీ చేయిస్తే ఆయనేమీ చేయలేరన్నది టీడీపీ స్కెచ్‌గా కనిపిస్తుంది. 20 ఏళ్ల తర్వాత కొడాలి నాని గుడివాడలో ఓడిపోవడంతో ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా పట్టు బిగించాలని టీడీపీ పక్కా స్కెచ్ గీస్తుందంటున్నారు. మరి గుడివాడలో కొడాలి నాని పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *