సిరా న్యూస్, జైనథ్:
సాత్నాల ప్రాజెక్ట్ లో దూకిన ఇంటర్ విద్యార్థి…
+ సంఘటన స్థలంలో సూసైడ్ నోట్, బాలుడి రిస్ట్ వాచ్ లభ్యం
+ పరీక్ష రాయలేకపోవడం చాలా బాధగా ఉందంటూ నోట్ లో వెల్లడి
+ బాలుడి కోసం తీవ్రంగా గాలిస్తున్న గజయితగాళ్లు
+ సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న పోలీసులు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో ఘోరం జరిగింది. మండలంలోని మాంగుర్ల గ్రామానికి చెందిన టేకం రాము కుమారుడు టేకం శివకుమార్ గురువారం ఊరి పక్కనే ఉన్న సాత్నాల ప్రాజెక్టులో దూకాడు. ప్రాజెక్ట్ ఒడ్డున సూసైడ్ నోట్, బాలుడికి చెందిన రిస్ట్ వాచ్ లభించడంతో స్థానికులు గుర్తించి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే తాను ఇంటర్మీడియట్ పరీక్ష రాయలేకపోవడం చాలా బాధగా ఉందంటూ నాన్నను ఉద్దేశించి వ్రాసిన సూసైడ్ నోట్ లభించడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు బాలుడు బుధవారం పరీక్ష రాయలేదా? లేదంటే గురువారం పరీక్షకు గైర్హాజరు అయ్యాడా? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న శివకుమార్ గురువారం ఉదయం 8 గంటలకు గ్రామం నుండి ఆటోలో ఆదిలాబాద్ కు బయలుదేరినట్లు స్థానికులు తెలిపారు. కాగా మరల 10.30 నిమిషాలకు ప్రాజెక్ట్ వద్ద అతన్ని చూసినట్లు కొంతమందినిస్థానికులు చెబుతున్నారు. నిమిషం ఆలస్యం నిబంధననే బాలుడి ప్రాణాలు తీసిందా? లేదా ఇంకేమైనా విషయాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. దారి గుండా ఉన్న సీసీ కెమెరాలతో పాటు బాలుడి పరీక్ష కేంద్రం వద్ద సైతం సీసీ ఫుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఏదేమైనాప్పటికీ కూడా ఇంటర్మీడియట్ చదివే విద్యార్థి సాత్నాలలో దూకడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.