సిరా న్యూస్, హైదరాబాద్:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో 2,290 మంది అభ్యర్థులు అంతిమంగా బరిలో ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఈ మేరకు అంతిమంగా బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 608 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. కాగా అత్యధికంగా ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజక వర్గంలోలో 48 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, అత్యల్పంగా బాన్సువాడ, నారాయణపేట నియోజకవర్గాల్లో ఏడుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కాగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో 44 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ అత్యధికంగా 70 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సీఎం పోటీ చేస్తోన్న మరో నియోజకవర్గం కామారెడ్డిలో 39 మంది అభ్యర్థులు అంతిమంగా బరిలో ఉన్నారు. అభ్యర్థుల సంఖ్యా పరంగా చూస్తే మునుగోడులో 39 మంది, పాలేరు 37, కోదాడ 34, నాంపల్లి 34, ఖమ్మం 32, నల్గొండ 31, కొత్తగూడెం 30, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో 10 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఈ నెల 30న పోలింగ్ నిర్వహిస్తుండగా, 28తో ప్రచార పర్వం ముగియనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు సమన్వయంతో ఎన్నికల భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.