సిరా న్యూస్,తిరుపతి;
బాధితులకు అండగా నిలబడాల్సిన పోలీస్ వ్యవస్థ కంచె చేను మేసిన విధంగా ప్రవర్తిస్తోందని చంద్రగిరి టిడిపి ఎం.ఎల్. ఏ అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధా రెడ్డి దుయ్యబట్టారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పులివర్తి నాని పై జరిగిన దాడికి నిరసనగా పులివర్తి సుధా రెడ్డి తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలియజేశారు. పులివర్తి సుధా రెడ్డికి మద్దతుగా తెలుగు తమ్ముళ్లు పోలీస్ స్టేషన్ వద్ద కు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరుచానూరు సిఐ శ్రీకాంత్ రెడ్డి పులివర్తి సుధా రెడ్డికి నచ్చజెపి నిరసనను విరమింప చేయాలని ప్రయత్నించడంతో ఒక్కసారిగా టిడిపి నిరసనకారులు నాని పై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని అంతవరకు కదిలేది లేదని భీష్ముంచుకుని రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పులివర్తి సుధా రెడ్డి మాట్లాడుతూ బాధితుల పక్షాన నిలబడాల్సిన పోలీసు వారు టిడిపి సానుభూతిపరులను అరెస్టు చేయడం అమానుషమని అన్నారు. జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ వ్యవస్థ దాడికి దిగిన వారిని అరెస్టు చేయకుండా మీనమేషాలు లెక్కబెడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసిపి వారిని జూన్ 4వ తేదీ వరకు అరెస్ట్ చేయలేమని జిల్లా ఎస్పీ చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. అలాగే టిడిపి చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్ మాట్లాడుతూ పోలీసు వారు టిడిపి వారు సానుభూతిపరులను ఎందుకు అరెస్ట్ చేశారు అని ప్రశ్నిస్తే ప్రివెంటివ్ యాక్ట్ కింద అరెస్ట్ చేసాం అనడం హాస్యాస్పదమని అన్నారు. వైసిపి వారు ఓడిపోతున్నామని దుగ్ధ తో టిడిపి వారిపై దాడులకు పాల్పడుతున్నారని, గుండా గిరి చేస్తూనారని ధ్వజమెత్తారు. వైసిపి రౌడీయిజాన్ని చూస్తూ సహించబోమని త్వరలోనే వైసీపీ వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. చట్ట పరంగా దాడికి పాల్పడిన వారికి శిక్ష పడేంత వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సుధా రెడ్డికి మద్దతుగా చంద్రగిరి జనసేన పార్టీ ముఖ్య నాయకులు మనోహర దేవర, టిడిపి తిరుచానూరు గ్రామ అధ్యక్షులు కిషోర్ రెడ్డి, చంద్రగిరి బీసీ అధ్యక్షులు మునిరత్నం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.