సిరా న్యూస్;
32 ఏళ్ల క్రితం నరేంద్ర మోదీ అయోధ్యని సందర్శించారు. రామ్ లల్లా అప్పటికి ఓ టెంట్లో ఉన్నాడు. ఆ విగ్రహాన్ని చాలా సేపు తదేకంగా చూశారట మోదీ. ఆ సమయంలో బయటకి వచ్చినప్పుడు జర్నలిస్ట్‌లు ఓ ప్రశ్న అడిగారు. “మళ్లీ అయోధ్యని ఎప్పుడు సందర్శిస్తారు” అని. ఏ మాత్రం తడుముకోకుండా “రాముడికి గుడి కట్టిన తరవాతే ఈ నేలపై అడుగు పెడతాను” అని ప్రతిజ్ఞ చేశారు. అలా తన 30 ఏళ్ల పంతాన్ని నెగ్గించుకుని జనవరి 22న జరగనున్న అయోధ్య రామ ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కానున్నారు నరేంద్ర మోదీ. కేవలం ఈ మహత్తర ఘట్టంలో పాలు పంచుకునేందుకే దేవుడు తనకీ జన్మనిచ్చాడేమో అంటూ మొన్నామధ్య భావోద్వేగానికి లోనయ్యారు. తనను తాను హిందూవాదిగా ఎప్పుడూ చెప్పుకోకపోయినప్పటికీ…ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు మోదీనే తమ ప్రతినిధిగా భావిస్తున్నారు. అంతగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అసలు మోదీ ప్రభుత్వం వచ్చిన తరవాతే హిందువులకు గౌరవం పెరిగిందని వాదిస్తున్న వాళ్లూ చాలా మందే ఉన్నారు. ఈ వాదనల సంగతి పక్కన పెడితే…మోదీ సర్కార్ మాత్రం హిందువులను ఐక్యం చేయడంలో సక్సెస్ అయిందన్న అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. అంతగా బలమైన ముద్ర పడడానికి కారణం..దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాల రూపురేఖలు మార్చేయడం. అందుకోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం. అన్నింటి కన్నా అయోధ్య రామ మందిరాన్ని నిర్మించేందుకు ప్రత్యేక చొరవ చూపించడం. ఇవే ప్రధాని మోదీ ఆదరణను అమాంతం పెంచింది. “మోదీ హయాంలో అయోధ్య రాముడి గుడి కట్టారు” అని వచ్చే తరాలు చెప్పుకుంటాయి. సనాతన ధర్మాన్ని పరిరక్షించడమే తమ ఎజెండాగా చెప్పే బీజేపీకి పొలిటికల్‌గానే కాకుండా సైద్ధాంతికంగా కూడా ఇది చరిష్మాని పెంచే కీలక పరిణామం ఇది. అయోధ్య ఆలయాన్నీ రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నా వాటిని పట్టించుకోకుండా ఘనంగా ఈ వేడుకని నిర్వహించేందుకు సిద్ధమైంది మోదీ సర్కార్. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠకు ముందు కూడా ప్రధాని మోదీ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఇటు ఉత్తర భారతం నుంచి అటు దక్షిణ భారతం వరకూ రామాయణంతో సంబంధం ఉన్న ఆలయాలను సందర్శిస్తున్నారు. అనుష్ఠాన దీక్షను పాటిస్తూనే ఆయా ఆలయాలకు వెళ్తున్నారు. పరోక్షంగా ఈ ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేస్తామన్న సంకేతాలిచ్చారు. ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లడమే ప్రధాని మోదీ లక్ష్యం అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఇందులో భాగంగానే ఆయన పలు కీలక ఆలయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వాటి రూపురేఖలు మార్చేందుకు నిధులు కేటాయించారు. PRASHAD పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఒక్కో ఆలయాన్ని తీర్చి దిద్దుతున్నారు. ఈ జాబితాలో మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది కాశీ విశ్వనాథుని ఆలయం గురించే. 2019లోనే మోదీ సర్కార్ కాశీ విశ్వనాథ్ ఆలయ పునర్నిర్మాణ పనులను చేపట్టింది. ఆ సమయంలో వందలాది బిల్డింగ్స్‌ని, ఇళ్లను సేకరించి వాటికి పరిహారం చెల్లించింది. దాదాపు రెండేళ్ల పాటు ఈ ఆలయ నిర్మాణ పనులు జరిగాయి. 2021లో ప్రధాని నరేంద్ర మోదీ కాశీ విశ్వనాధ్ ఆలయా్పి ని ప్రారంభించారు. ఈ కారిడార్ నిర్మాణానికి మోదీ సర్కార్ దాదాపు రూ.350 కోట్లు ఖర్చు చేసింది. వారణాసికే ఇది మెగా ప్రాజెక్ట్‌గా నిలిచింది. అప్పటి నుంచి భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. ఈ కారిడార్‌లో మొత్తం 23 భవనాలు నిర్మించింది. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సువిధా కేంద్రాలు, టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది. మొత్తం 5 వేల హెక్టార్లలో ఈ కారిడార్ నిర్మాణం చేపట్టింది. కాశీ విశ్వనాథుని కారిడార్ తరవాత గుజరాత్‌లోని సోమ్‌నాథ్ ఆలయంని పునర్నిర్మించింది మోదీ సర్కార్. మహమ్మద్ గజినీ పాలనలో ఎన్నోసార్లు ఈ ఆలయం దాడులకు గురైంది. ఆ తరవాత ఎన్నో సార్లు నిర్మించారు. ప్రధాని మోదీ ఈ ఆలయాన్ని పునర్నిర్మించేలా చొరవ చూపించారు ఎస్కేటీనీ ఏర్పాటు చేశారు. రూ.47 కోట్లతో తో పాటుటూరిస్ట్ ఫెసిలిటేషన్ నీ నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణాన్నీ నగర శైలిలోనే చేపట్టారు. 2013 వరదల్లో ధ్వంసమైన కేదార్నాథ్ ఆలయాన్నీ రీడెవలప్ చేశారు. ఛార్ ధామ్ ప్రాజెక్ట్‌లో భాగంగా యమునోత్రి, గంగోత్రి, బద్రినాథ్ పుణ్యక్షేత్రాలనూ అభివృద్ధి చేశారు. ఈ నాలుగు ప్రాంతాలనూ అనుసంధానించేలా రోడ్ల నిర్మాణం కూడా చేపట్టారు. 2017లో కోయంబత్తూర్‌లోని 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈశా ఫౌండేషన్ నిర్మించిన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి అందరి దృష్టి మళ్లేలా చేశారు. తరచూ ఆలయాలు సందర్శిస్తూ వాటి ప్రాధాన్యతను తెలియజేశారు. ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2019లో జమ్ముకశ్మీర్‌కి సంబంధించి ఆర్టికల్ 370ని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. అప్పటి నుంచి కశ్మీర్ లోయలోనూ ఆలయాలనూ రీడెవలప్ చేసే కార్యక్రమాన్ని చేపడుతోంది. శ్రీనగర్‌లోనూ ఆలయాలను పునరుద్ధరిస్తోంది. కేవలం భారత్‌లోనే కాదు. విదేశాల్లోనూ కీలక ఆలయాల నిర్మాణాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 2018లో అబుదాబిలో తొలి హిందూ ఆలయానికి శంకుస్థాపన చేయడం అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ఆ తరవాత బహ్రెయిన్‌లో 200 ఏళ్ల నాటి శ్రీకృష్ణ శ్రీనాథ్జీ ఆలయ రీడెవలప్మెంట్కి ప్రత్యేకంగా చొరవ చూపించారు. ఇప్పుడు అయోధ్యనీ అత్యంత వైభవంగా తీర్చిదిద్దింది మోదీ ప్రభుత్వం. అయోధ్య ఆలయం అనేది కోట్లాది మంది సెంటిమెంట్. పైగా వందల ఏళ్లుగా నలుగుతున్న వివాదం ఇది. ఈ సమస్యను పరిష్కరించడంలో చొరవ చూపించడమే కాకుండా…అయోధ్యను ఆధ్యాత్మిక పర్యాటకానికి హబ్‌గా మార్చేందుకూ అన్ని ఏర్పాట్లు చేసింది. రైల్వే స్టేషన్‌ని పునరుద్ధరించింది. కొత్తగా ఎయిర్పోర్ట్ నిర్మించింది. దీంతో పాటు అక్కడ ఆతిథ్య రంగమూ ఊపందుకుంటోంది. ఇలా అన్ని పుణ్యక్షేత్రాలకూ పునర్వైభవం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రధాని మోదీ. ఇకపైనా ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇన్నాళ్లూ అంతంత మాత్రం సౌకర్యాలతో ఉన్న కీలక ఆలయాలను పునర్నిర్మించడం వల్ల అటు ఆర్థికంగానూ ప్రయోజనం కలగనుంది.