-నేడు అయిన వర్ధంతి
సిరా న్యూస్;
స్వరాజ్యం నా జన్మహక్కు..దాన్ని నేను పొంది తీరుతాను అని స్వాతంత్ర పోరాటంలో గర్జించిన ధీరుడు లోకమాన్య బాలగంగాధరతిలక్. దేశవ్యాప్తంగా సామాన్యప్రజల్ని భారతజాతీయోద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో బాలగంగాధర తిలక్ సఫలీకృతుడయ్యారు. అందుకే ఆయనను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడు గా భావిస్తారు.అతను జాతీయోద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించడం తో ఆయనను భారతజాతీయోద్యమ పితగా పేర్కొంటారు.ఇతనికి లోకమాన్య అనే బిరుదు కూడా ఉంది.మహాత్మా గాంధీ అతన్ని “ఆధునిక భారతదేశపు మేకర్” అని పిలిచారు.
బాలగంగాధరతిలక్ 1856 జులై 23వ తేదీన మహారాష్ట్ర లోని రత్నగిరిలో జన్మించాడు. తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ సంస్కృత పండితుడు. తల్లి పార్వతీ బాయి ఆధ్యాత్మిక సంపన్నురాలు, బాల్యం లో తిలక్ చాలా చురుకైన విద్యార్థి. ప్రత్యేకించి గణితశాస్త్రంలో ఆయన విశేష ప్రతిభ కనబరచేవాడు. చిన్నప్పటి నుంచి అన్యాయం ఎక్కడ జరిగినా సహించని గుణమాయనది. నిజాయితీతో బాటు ముక్కుసూటితనం ఆయనకు సహజం. కళాశాలకు వెళ్ళి ఆధునిక విద్యనభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో ఆయనొకడు. తిలక్ కు పదేళ్ళ వయసున్నప్పుడు ఆయన తండ్రికి రత్నగిరి నుంచి పుణెకు బదిలీ అయింది. ఇది తిలక్ జీవితంలో పెనుమార్పు తీసుకువచ్చింది. పుణె ఆంగ్లోవెర్నాకులర్ పాఠశాలలో చేరి కొందరు ప్రసిద్ధి చెందిన ఉపాధ్యాయుల వద్ద విద్యనభ్యసించాడు. ఐతే పూణెకు వచ్చిన కొంతకాలానికే ఆయన తన తల్లిని, పదహారేళ్ళ వయసులో తన తండ్రిని కోల్పోయాడు.
మెట్రిక్యులేషన్ చదువుతున్నప్పుడే సత్యభామ అనే పదేళ్ళ అమ్మాయితో పెళ్ళయింది. మెట్రిక్ పాసయ్యాక దక్కన్ కళాశాలలో చేరాడు. 1877లో తిలక్ గణితశాస్త్రంలో ప్రథమశ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత తనచదువును కొనసాగించి ఎల్.ఎల్.బి. పట్టా కూడా పొందాడు తిలక్. 1890లో కాంగ్రెస్ లో సభ్యుడుగా చేరాడు. కానీ త్వరలోనే తిలక్ కు కాంగ్రెస్ మితవాద రాజకీయాలపై నమ్మకం పోయింది. స్వరాజ్యం కోసం పోరాటమే సరైన మార్గమని నమ్మాడు. అప్పటివరకు కాంగ్రెస్ ప్రతి సంవత్సరం డిసెంబరు చివరివారంలో మూడు రోజులపాటు సమావేశమై బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను “ప్రార్థించు, వినతి, నిరసన” చెయ్యడానికే పరిమితమైంది. తిలక్ దాని గురించి చాలా ఘాటైన విమర్శలు చేశాడు. “మీరు సంవత్సరానికొకసారి మూడు రోజులపాటు సమావేశమై కప్పల మాదిరి బెకబెకలాడడం వల్ల ప్రయోజనం లేదు.” అని, “అసలు కాంగ్రెస్ సంస్థ అడుక్కునేవాళ్ళ సంఘం (బెగ్గర్స్ ఇన్స్టిట్యూషన్)” అన్నాడు. కాంగ్రెస్ సమావేశాలను 3-డే తమాషాగా అభివర్ణించాడు. “స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని నేను పొంది తీరుతాను.” అని గర్జించాడు.””
1907లో మహారాష్ట్రలోని సూరత్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ చీలిపోయింది. మితవాదులు కాంగ్రెస్ పై తమ పట్టును నిలబెట్టుకున్నారు. అతివాదులుగా పిలవబడే తిలక్ మద్దతుదారులు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. తిరిగి 1916లో లక్నోలో జరిగిన సమావేశంలో అంతా ఒకటయారు. అదే సమావేశంలో కాంగ్రెస్ కు, ముస్లిం లీగుకు మధ్య లక్నో ఒప్పందం కుదిరింది. తిలక్ పాశ్చాత్యవిద్యావిధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిచాడు – అది భారతీయ సాంస్కృతికవారసత్వాన్ని అగౌరవపరచి భారతీయ విద్యార్థులను చిన్నబుచ్చేవిధంగా ఉందని. ప్రజలకు మంచి విద్యను అందించడం ద్వారానే వాళ్ళను మంచి పౌరులుగా మార్చవచ్చనే ఉద్దేశం బాలగంగాధరతిలక్ ది. భారతీయులకు భారతీయ సంస్కృతి గురించి, భారతదేశపు ఔన్నతాన్ని గురించి బోధించాలని ఆయన ఆశయం. అందుకే అగార్కర్, విష్ణుశాస్త్రి చిప్లుంకర్ లతో కలిసి దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ని స్థాపించాడు. ఆ తర్వాత తాను నడిపిన పత్రికలు మరాఠా(ఆంగ్ల పత్రిక), కేసరి(మరాఠీ పత్రిక) లలో మొద్దు నిద్రపోతున్న భారతీయులను మేల్కొల్పడానికి పదునైన భాషలో బ్రిటిష్ పాలనలోని వాస్తవ పరిస్థితుల గురించి వివరంగా రాశాడు. బాల్యవివాహాలను నిరసించి వితంతు వివాహాలను స్వాగతించాడు. జాతీయస్ఫూర్తిని రగల్చడానికి వీలున్న ఏ అవకాశాన్నీ ఆయన వదిలిపెట్టలేదు. మొట్టమొదటిసారిగా శివాజీ ఉత్సవాలను, గణపతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ప్రజలను సమీకరించడం, వారిని జాతీయోద్యమం వైపు నడిపించడం తిలక్ మొదలుపెట్టాడు. పత్రికల్లో ప్రజలను రెచ్చగొట్టే రాతలు రాసినందుకు 1897లో తిలక్ కు ఒకటిన్నరేళ్ళు కారాగారశిక్ష పడింది. విడుదలయ్యాక స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1906లో దేశద్రోహం నేరం క్రింద ఆరేళ్ళు ప్రవాసశిక్ష విధించారు. కారాగారంలో ఉన్నప్పుడే గీతారహస్యం అనే పుస్తకం రాశాడు, చరిత్రకారుడు కూడా. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని అభిప్రాయం. 1916 ఏప్రిల్ లో హోంరూల్ లీగ్ను స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూ మధ్యభారతదేశంలో గ్రామగ్రామానా తిరిగాడు. అనీబిసెంటు అదే సంవత్సరం సెప్టెంబర్లో మొదలుపెట్టి హోంరూల్ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసింది. ఆ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో ఒక కోర్టుకేసులో లండనుకు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడే, అంటే 1917 ఆగస్టులో అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాంటేగు బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైన భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి వీలుగా అన్ని పాలనాంశాల్లో భారతీయులకు అధిక ప్రాధాన్యాన్నివ్వడమే ప్రభుత్వ విధానమని బ్రిటిష్ ప్రభుత్వం తరపున ప్రకటించాడు. బాధ్యతాయుత ప్రభుత్వమంటే ఎవరికి బాధ్యత వహించే ప్రభుత్వమో, అధిక ప్రాధాన్యమంటే ఎంత ప్రాధాన్యమో, అసలు అది ఎప్పుడిస్తారో ఏదీ స్పష్టంగా లేదు. కానీ బ్రిటిష్ ప్రభుత్వ నిజాయితీని నమ్మిన అనీబిసెంటు ఆ ప్రకటనతో ఉద్యమాన్ని అపేసి ప్రభుత్వానికి తన మద్దతు ప్రకటించింది. అలా ఇద్దరు నాయకులదీ చెరొకదారీ కావడంతో హోంరూల్ ఉద్యమం చల్లబడిపోయింది. కానీ ప్రజల్లో తిలక్ రగిలించిన స్ఫూర్తి మాత్రం కొనసాగింది. 1920 ఆగస్టు 1వ తేదీన బొంబాయిలో 64 ఏళ్ల వయసులో బాలగంగాధర్ తిలక్ స్వర్గస్తులయ్యారు.