ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు

సిరా న్యూస్;

-నేడు ఆయన జయంతి
టంగుటూరి ప్రకాశం పంతులు 1872 ఆగష్టు 23న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెము గ్రామంలో నియోగి బ్రాహ్మణులైన సుబ్బమ్మ, గోపాల కృష్ణయ్య దంపతులకు జన్మించాడు. సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు. 1940, 50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకడు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాడు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు. 1921లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1921 అక్టోబర్ 29 న స్వరాజ్య అనే దినపత్రికను ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే, ఈ పత్రిక మంచి ఆదరణ చూరగొన్నది. దీని తెలుగు, తమిళ సంచికలకు ప్రజలు ఎగబడ్డారు. 1928లో మద్రాసులో సైమన్‌ కమిషను బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని, తుపాకికి ఎదురు నిలిచి, కాల్చమని సవాలు చేసాడు. ఆయన ధైర్యసాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్ర కేసరి అనే బిరుదునిచ్చి గౌరవించారు.1937లో కాంగ్రెసు అధికారంలోకి వచ్చినపుడు, రాజాజీ మంత్రివర్గంలో ఆయన రెవిన్యూమంత్రి అయ్యాడు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. 1946లో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై, 13 నెలలపాటు ఆ పదవిలో కొనసాగాడు. ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాడు. స్వంతపార్టీలోని అంతర్గత రాజకీయాలకు ఆయన ప్రభుత్వం బలయ్యాక, పార్టీ నుండి బయటకు వచ్చి, స్వంతంగా ప్రజాపార్టీని స్థాపించాడు. రాజకీయాలనుండి వైదొలిగినా, ప్రకాశం చురుకుగా రాష్ట్రమంతటా పర్యటించాడు. అలాంటి ఒక ఒంగోలు పర్యటనలో వడదెబ్బకు గురై, నీరసించి హైదరాబాదులో ఆసుపత్రిలో చేర్పించబడ్డాడు. అక్కడే ప్రకాశం 1957, మే 20న పరమపదించాడు.
===========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *