సిరా న్యూస్,విశాఖపట్టణం;
ఐదు రోజుల క్రితం జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటన ప్రారంభించి అధికార పార్టీ శాసనసభ్యులను టార్గెట్ చేశారు. నియోజకవర్గాల వారీగా సమస్యలను ఏకరువు పెట్టారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల వారీగా ఆయన సమీక్ష సమావేశాలు పెట్టి అధికారి పార్టీ అవినీతి, అక్రమాలు, పెండింగ్ ప్రాజెక్టులపై విమర్శలు గుప్పించారు. ఆయన పర్యటన సాగుతుండగానే పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తుని, నర్సీపట్నం, చింతపల్లి నియోజక వర్గాల్లో సభలు నిర్వహించి అధికార పార్టీని, పార్టీ అధినేత అయిన తన అన్నను ఒక రేంజ్‌లో ఆడుకొన్నారు. తునిలో అయితే అక్కడి శాసనసభ్యుడి పేరు తాడిశెట్టి రాజా కాదని, ‘అనుభవించు రాజా’ అని ర్యాంగింగ్ చేశారు. మందు, ముక్క, జూదం లేకపోతే ఆయనకు పూట గడవదని, చేయని అవినీతి లేదని ఘాటుగా విమర్శించారు. నర్సీపట్నం, చింతపల్లి నియోజకవర్గాలలో భారీగా జరిగిన షర్మిల సభల తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులు అక్కడ గెలవక పోయినా వైఎస్సార్ కాంగ్రెస్ విజయావకాశాలను గండి కొట్టడం ఖాయమని తేలిపోయింది.ఇక వీరిద్దరి పర్యటనలు పూర్తి కాగానే శంఖారావం అంటూ తెలుగుదేశం యువ నేత నారా లోకేశ్ ఇచ్ఛాపురం నుంచి యాత్ర ప్రారంభించి రోజుకు మూడు నియోజక వర్గాలలో అధికార పార్టీ దుమ్ము దులుపుతున్నారు. ‘యువగళం’ పాదయాత్రలో కవర్ చేయని నియోజక వర్గాల కోసం ఆయన ‘శంఖారావం’ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీకి కాస్త అనుకూలమనే ప్రచారం జరిగిన పలాస, నరసన్నపేటలలో లోకేశ్‌కు లభించిన ప్రజాదరణ చూసిన తర్వాత అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నేతలే కలవరపడుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో లోకేష్ నిర్వహిస్తున్న సభలకు వేల సంఖ్యలో జనం తరలి రావడం, ప్రసంగాలు కూడా స్థానిక శాసనసభ్యుల అవినీతి, అక్రమాలపైనే ఉండడం తెలుగుదేశం శిబిరంలో ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రతి నియోజక వర్గంలోనూ ఆ నియోజక వర్గ జనసేన ఇన్‌చార్జిని ఆ వేదిక మీదకు పిలవడంతో పాటు ఆయనతో మాట్లాడించడం ద్వారా లోకేష్ జనసైనికులు దూరం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.లోకేష్, షర్మిల, నాగబాబుల సభలకు మంచి స్పందన రావడం.. మరోపక్క అధికార పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు స్పందన లేకపోవడం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను కలవరపరుస్తోంది. ప్రతిపక్షాలు ఆరోపణలు, విమర్శలతో చెలరేగిపోతుంటే అధికార పార్టీ నేతలు ‘యాత్ర-2’ సినిమా టికెట్ల పంపిణీ, ‘ఆడుదాం ఆంధ్రా’ ఏర్పాట్లు, జనసమీకరణతో కాలక్షేపం చేస్తున్నారు. వీటన్నింటికీ మించి అధికార పార్టీకి చెందిన మెజారిటీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు తమకు టికెట్ వస్తుందో రాదో అన్న సంశయంతో ధైర్యంగా కార్యక్రమాలను నిర్వహించడం, ప్రతిపక్షాలపై విరుచుకుపడడం వంటి పనులు చేయలేకపోతున్నారు. ఇక్కడ టికెట్ రాక పోతే మరో పార్టీ వైపు చూడాలనే ఆలోచన వారిని కట్టి పడేస్తోంది.