సిరా న్యూస్,మహబూబ్ నగర్;
పదేండ్ల పాటు అధికారంలో ఉండి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత మాజీ మంత్రులు.. మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగానే ఉంటున్నారు. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నారే తప్ప.. నియోజకవర్గ కేంద్రాలలో ఉండడం లేదు. దీంతో పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతోంది. గులాబీ పార్టీని నమ్ముకుని కొనసాగడమా.. లేదా పార్టీ మారడమా అన్న ఆలోచనలలో క్యాడర్ తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేనాటికి క్యాడర్ లో పెద్ద ఎత్తున మార్పులు జరగవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్థానాల పునర్విభజన, మహిళ రిజర్వేషన్ అమలు ప్రక్రియలు ఒకింత భయపెడుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏ మండలాలు.. ఏ నియోజకవర్గంలో చేరుతాయో.. తమ సొంత మండలం తాను పోటీ చేయాలని అనుకుంటున్న నియోజకవర్గంలో ఉంటుందో లేదో..!? మహిళా రిజర్వేషన్ అమలు అయి తమ కోరుకుంటున్న స్థానాలు మహిళలకు వెళ్లిపోతే తమ పరిస్థితి ఏంటి …?అని ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు, పునర్విభజన సంగతులు ఎలా ఉన్నా.. ఇప్పటినుండి ఖర్చులు పెట్టడం ఎందుకు అని ఆలోచనలు చేస్తూ మాజీలు.. వచ్చామా.. చూసామా.. వెళ్ళామా..! అన్నట్లుగా వ్యవహరిస్తుండడం పార్టీ క్యాడర్‌లో ఆందోళనలను కలిగిస్తోంది.ఎన్నికల అనంతరం మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు స్థానికంగా ఒకరు కూడా ఉండటం లేదు. పండుగల సమయాలలో ఒక్కరు ఇద్దరు మినహాయిస్తే.. మిగిలిన వారు ఎవరు కూడా నియోజకవర్గ ప్రజలకు.. పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉండటం లేదు. పార్టీ కార్యక్రమాలు ఏమైనా ఉంటే నడపదడప వచ్చిపోవడమేనా ఇస్తే పార్టీ క్యాడర్ కు ఇబ్బందులు వస్తే వారికి అండగా కూడా ఉండడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు మాజీలు అయితే ఓడిపోయిన తర్వాత నియోజకవర్గానికి ఒకటి రెండుసార్లుక్ మాత్రమే వచ్చి వెళ్లినట్టు పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.మాజీలు అంటిముట్టనట్టుగా అన్నట్లుగా ఉంటుండడంతో.. స్థానిక నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం పక్క చూపులు చూస్తున్నట్లు సమాచారం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే లక్ష్యంతో అధికార పార్టీ నాయకులు కార్యకర్తలతో సమాలోచనలు చేయడానికి పలువురు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండి, సమస్యలు పరిష్కరించుకుంటే క్యాడర్ ఎవరి దారిన వాళ్ళు వెళ్లడం ఖాయమని పలువురు నాయకులు అంటున్నారు.