– జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్
సిరా న్యూస్,నాగర్ కర్నూల్;
సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణలో భాగంగా 6 గ్యారంటీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అన్నారు.
శుక్రవారం 75వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ పట్టణంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవానికి జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకావిష్కరణ చేశారు.
పోలీసుల గౌరవ వందనాన్ని జిల్లా ఎస్పీతో కలిసి కలెక్టర్ స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ప్రసంగిస్తూ… ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ పాలన నుంచి విముక్తమైన భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించిందన్నారు.
ఆ రోజు నుండి భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛను, సమానత్వాన్ని, లౌకికత్వాన్ని, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగిందని, అలాగే ప్రతి పౌరుడు దేశ సేవకు, దేశాభివృద్ధికి పాటుపడేలా భారత రాజ్యాంగం భాధ్యతలను కల్పించడం జరిగిందన్నారు.
తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా, సంక్షేమంలో సరికొత్త అధ్యాయం లిఖించాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పట్టుదలగా ఉందన్నారు.
ప్రజల ఉద్యమ ఆకాంక్షలు, ప్రజా సంక్షేమమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు, ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ భాద్యతగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
ముఖ్యంగా వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ తో పాటు రైతు భరోసా పథకం అమలు చేయడంలో భాగంగా చిన్న, సన్నకారు రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ చేయడం, ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 1 లక్ష 81 వేల మంది రైతులకు రూ.105 కోట్లు వారి ఖాతాలలో జమ చేయడమైనదన్నారు.
రూ. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయని,ఒక పద్దతి ప్రకారం ఆ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.
జిల్లాలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిభా ఫూలే ప్రజా భవన్ లో ప్రతి మంగళ, శుక్రవారాలు ప్రజావాణి పేరుతో ప్రజా సమస్యలు వినేందుకు మంత్రులు అందుబాటులో ఉంటున్నారు. ఇందులో నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి 80 దరఖాస్తులు రావడం జరిగిందని వీటిలో 15 దరఖాస్తులను ఇప్పటికే పరిష్కరించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.