జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;
సామాజిక మరియు ఆర్ధిక సర్వే ద్వారా వివిధ వర్గాల ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఎలాంటి పొరపాట్లుకు తావులేకుండా నమోదులు చేసేందుకు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో సామాజిక ఆర్థిక సర్వే, ధాన్యం కొనుగోళ్లు, నవంబర్ 2వ తేదీన రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్, సభ్యులు హన్మకొండలో నిర్వహించు ప్రజాభిప్రాయ సేకరణ తదితర అంశాలపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సామాజిక ఆర్ధిక సర్వే ప్రక్రియపై సమగ్ర అవగాహనకలిగి ఉండాలని తెలిపారు. ప్రతి రోజు సర్వే అనంతరం వివరాలను డేటా ఎంట్రీ చేసేందుకు అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లును సిద్ధం చేయాలని తెలిపారు. ఐడిఓసి కార్యాలయంలో పర్యవేక్షకులకు మాస్టర్ ట్రైనరులతో శిక్షణా కార్యక్రమం ఉంటుందని, తదుపరి పర్యవేక్షకులు మండల స్థాయిలో సర్వే లో పాల్గొననున్న ఎన్యూమరేటర్లుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. సర్వే ప్రక్రియ నిర్వహణకు ఎన్యూమరేషన్ బ్లాకులుగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 933 బ్లాకులు ఏర్పాటు చేశామని ఈ సర్వే ప్రక్రియ నవంబర్ 25 వరకు పూర్తి చేయాల్సి ఉన్నట్లు తెలిపారు. నవంబర్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్, సభ్యులు అన్ని వర్గాల సమగ్ర సమాచార సేకరణ ప్రక్రియపై నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణపై ప్రజలు కుల సంఘాల నాయకులు, మేధావులు, సంచార జాతులు, ప్రజా ప్రతినిధులు తదితరులు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న బిసి సంక్షేమ అధికారి కార్యాలయంలో విజ్ఞాపనలు అంద చేయాలని తెలిపారు. బీసీ కమిషన్ ద్వారా అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు, సూచనలు సేకరించబడుతున్నాయని, కమిషన్, సభ్యులు ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటిపై వివరణాత్మక నివేదికను రూపొందించనున్నారని తెలిపారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని వారి వారి అభిప్రాయాలను తెలియజేయాలని ఆయన సూచించారు. మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడివోలు, ఎంపీవోలు మండల, గ్రామ స్థాయిలో సర్వే ప్రక్రియను పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు.
వచ్చే వారం నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో కొనుగోలుకు సన్నదంగా ఉండాలని సంబంధిత అధికారు లను ఆదేశించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించిందని, ఈ ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ చేయాలని మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. రైతుల నుండి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయడం ద్వారా వారికి ఆర్ధిక భద్రత కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీవో మంగీలాల్, బీసీ సంక్షేమ అధికారి శైలజ, పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, మేనేజర్ రాములు, సహకార అధికారి వాలియా నాయక్, డిఆర్డిఓ అవినాష్, వ్యవసాయ అధికారి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.