సిరా న్యూస్,హైదరాబాద్;
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో భారీ స్కామ్ జరిగిందని అనుమానిస్తున్న కేసులో ఏసీబీ దూకుడుగా దర్యాప్తు చేస్తోంది. ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం కొరడా విసురుతోంది. రాష్ట్రంలో జరిగిన పలు స్కాములపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్ల అంశం, లిక్కర్ పాలసీ కేసు ఇలా పలు అంశాలపై గత ప్రభుత్వం అవినీతి ఆరోపణలు ఎదురుకుంటోంది. వీటిలో లిక్కర్ పాలసీ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కొన్ని నెలల పాటు జైలుకు సైతం వెళ్లి వచ్చారు. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో అవినీతి జరిగినట్టు ఆరోపణలు రావడంతో కేసీఆర్ ను విచారణకు ఆహ్వానించినప్పటికీ ఆయన వెళ్లలేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరుగుతుండగా గత ప్రభుత్వంలో పనిచేసి ఆరోపణలు ఎదురుకున్న అధికారి విదేశాల్లో ఉన్నారు. ఫార్ములా ఈ-రేసింగ్‌కు సంబంధించి రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు అక్రమంగా చెల్లించినట్లు గుర్తించారు. మున్సిపల్ శాఖ వద్ద రికార్డుల ఆధారంగా విదేశీ సంస్థలు, ప్రతినిధులకు నోటీసులు ఇవ్వనున్నారు. ఫార్ములా ఈ-రేసింగ్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన గత ప్రభుత్వంలోని పెద్దలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ రేసు వ్యవహారం మొత్తం కేటీఆర్ కనుసన్నల్లో జరగడంతో ఆయనకే నోటీసులు ఇస్తారని అంటున్నారు. ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్‌లో చోటుచేసుకున్నఅక్రమాలపై విచారణకు అవినీతి నిరోధక శాఖకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ రేస్‌లో రూ.55 కోట్లు ఎలాంటి అనుమతులు లేకుండా తరలించారు. ఐఏఎస్‌లు సహా అప్పటి బీఆర్ఎస్ సర్కారు పెద్దల ప్రమేయం ఉండడంతో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. నుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ప్రస్తుత ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీ వెంటనే విచారణ ప్రారంభించింది. కేసుతో సంబంధం ఉన్నవారందరికీ విడివిడిగా నోటీసులు ఇచ్చి, విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేయనున్నారు. ఐఏఎస్‌లు మొదలు కీలక అధికారులు, నాటి ప్రజాప్రతినిధుల దాక వీరిలో ఉండే అవకాశం ఉంది. స్టేట్మెంట్ ఆధారంగా గత ప్రభుత్వంలోని కీలక నేతలకు నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశం ఉంది. ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి అప్పటి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ఆదేశిస్తేనే విదేశీ సంస్థలకు నిధులు విడుదల చేశామని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. మున్సిపల్ శాఖ ఉన్నతాధికారిగా పని చేసిన అర్వింద్ కుమార్ కేటీఆర్ నోటి మాట ద్వారా ఆదేశించడంతోనే నిధులు ఇచ్చామని అంటున్నారు. మున్సిపల్ శాఖ నుంచి నిధులు మాయమయ్యాయి. ఓ విదేశీ సంస్థకు వెళ్లాయి. ఆ విదేశీ సంస్థకు చెల్లించాల్సిన అవసరమే లేదు. చెల్లించేందుకు ఆర్థికశాఖ అనుమతి.. కేబినెట్ అనుమతి లేదు. పూర్తిగా ప్రజాధనం లెక్కల్లో లేకుండా పోయింది. ఇది పూర్తిగా నిధుల స్వాహా అనే అభిప్రాయం కల్పిస్తుంది. అందుకే ఏసీబీ కేసు నమోదు చేసింది. సీరియస్ నేరం కావడం పక్కాగా సాక్ష్యాలు ఉండటంతో విచారణకు పిలిచి అరెస్టులు చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.