అప్పుడు ఆకాశంలో.. ఇప్పుడు రోడ్డు మార్గంలో..

సిరా న్యూస్,కడప;
అధికారం అనేది ఒక మత్తు. దాంట్లో అన్ని రకాల లోపాలతో పాటు ఇబ్బందులు కొట్టుకెళ్లిపోతాయి.కానీ ఒక్కసారి అధికారానికి దూరమైతే ఎన్నెన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు అటువంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు జగన్. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగు పెట్టాలంటే హెలికాప్టర్ ఉండాల్సిందే. చివరకు పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు నగరాలకు వెళ్లాలన్నా హెలిక్యాప్టర్ లో బయలుదేరాల్సిందే. రెండు కిలోమీటర్ల దూరాన్ని హెలికాప్టర్ లో వెళ్లేందుకు.. 400 కిలోమీటర్ల దూరం నుంచి హెలిక్యాప్టర్ ను తెప్పించే రేంజ్ జగన్ ది. అయితే ఇప్పుడు కూత వేటు దూరంలో హెలిక్యాప్టర్లు, ప్రత్యేక విమానాలు ఉన్నా… తెప్పించుకోలేని పరిస్థితి ఆయనది. 200 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించారు జగన్. అది కూడా చాన్నాళ్లకు. అధికారం దూరమయ్యేసరికి.. ఆకాశమార్గం నుంచి రోడ్డు మార్గానికి పడిపోయింది జగన్ రేంజ్.ఓటమి తరువాత రిలాక్స్ కావడానికి సొంత నియోజకవర్గం పులివెందుల వెళ్లారు జగన్. ఐదు రోజులపాటు అక్కడే గడపాలని డిసైడ్ అయ్యారు. కానీ వెళ్లిన వెంటనే బిల్లుల గోల తో హోరెత్తించారు సొంత పార్టీ నేతలు. ప్రతిరోజు ఈ బిల్లుల పంచాయతీ నడుస్తుండడంతో అక్కడ ఉండడం శ్రేయస్కరం కాదని జగన్ భావించారు. అందుకే బెంగళూరు వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారు. సాధారణంగా పదవి పోయిన ప్రత్యేక విమానం అందుబాటులోకి తెచ్చుకోగల రేంజ్ జగన్ ది. ఇప్పటివరకు అత్యంత విలాసవంతమైన విమానాల్లోనే ప్రయాణించారు ఆయన. అయితే ఈసారి ఆయన విజ్ఞప్తిని పట్టించుకోలేదో, ఇతరత్రా కారణాలు తెలియదు కానీ కనీసం హెలిక్యాప్టర్ కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు. కడప నుంచి బెంగళూరుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఫ్లైట్లు అందుబాటులో ఉన్నా దానిని ఆశ్రయించలేదు. రోడ్డు మార్గం గుండా.. అది కూడా గోతులు మయంగా ఉన్న రహదారిలో 200 కిలోమీటర్ల మేర రోడ్డు ప్రయాణం చేశారంటే ఆయన ఎంతలా పొదుపు పాటిస్తున్నారు అర్థం చేసుకోవచ్చు.జగన్ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగుపెడితే హెలికాప్టర్ ఉండాల్సిందే.ఎన్నికలకు ముందే రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు హెలిక్యాప్టర్లను అందుబాటులోకి తెచ్చారు జగన్. కేవలం తన పర్యటనల కోసమే అన్నట్టు వాటిని వినియోగించారు. ఇక పరదాల మాటున ప్రయాణం గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. కానీ ఇప్పుడు ప్రజలు తిరస్కరించడంతో జగన్ కు ఏం చేయాలో పాలు పోవడం లేదు. సహకరించిన వర్గాలు సైతం దూరమయ్యాయి. అందుకే ఇప్పుడు సింపుల్ సిటీని అలవరుచుకుంటున్నారు. అయితే ఎక్కడా ఒక కుదురుగా కూర్చోలేకపోతున్నారు. పులివెందులలో రిలాక్స్ అవుతామని భావిస్తే.. సొంత పార్టీ శ్రేణులు అసౌకర్యానికి గురి చేశారు. మున్ముందు ఇలాంటి ఇబ్బందులు జగన్ కు తప్పేలా లేవు.
========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *