సిరా న్యూస్,కడప;
కూటమి ప్రభుత్వం ఏర్పటి నిండా అయిదు నెలలు కాలేదు. అప్పుడే ఎన్నికలు దగ్గరపడ్డట్లు .. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని అప్పుడు అందరి లెక్కలు తేలుస్తామని జగన్ హెచ్చరిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారలో ఇప్పుడు కూడా అదే ఒంటెద్దు పోకడ పోతూ సొంత పార్టీ వారి నుంచే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. వరుసగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుందని తెలిసి కూడా తన పార్టీ అసెంబ్లీని బాయ్‌కాట్ చేస్తుందని ప్రకటించి వైసీపీ ఎమ్మెల్యేలను ఉలిక్కిపడేలా చేశారు.వైసీపీ అధ్యక్షుడు జగన్ లో ఓటమి తర్వాత కూడా మార్పు కనిపించడం లేదు. ఘోర పరాజయం తర్వాత కూడా సొంత పార్టీ వారికి కనీస వాల్యూ ఇవ్వడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఓటమి తర్వాత కూడా అలాగే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వైసీపీలోనే వినపడుతున్నాయి. జగన్ ఎక్కువ సమయం ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. ఆయనకు పార్టీ విషయాలను, నిర్ణయాలను నేతలతోపంచుకునే ఉద్దేశ్యం లేనట్లే కనిపిస్తుంది. ఏ పార్టీలోనైనా నాయకుడు పార్టీ నేతలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ప్రాంతీయ పార్టీల్లోనూ పొలిట్ బ్యూరోలు వంటివి ఉంటాయి. వైసీపీలో ఇవేమీ కనిపించవు. ముందు నుంచి అంతే. జగన్ అనుకున్నది అనుకున్నట్లే జరగాలి. తాజాగా ఆయన తీసుకున్న రెండు నిర్ణయాలు మరోసారి ఆయన వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. అదే వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. తలపండిన సీనియర్ నేతలు ఎందరో వైసీపీలో ఉన్నారు. వారందరినీ సంప్రదించి నిర్ణయాలు తీసుకునే సంప్రదాయం మాత్రం వైసీపీలో లేదు. అదే అనేక మంది నేతలకు రాజకీయంగా ఇబ్బందిగా మారిందంటున్నారు . పలువురు సీనియర్లు పార్టీని వీడి పోతున్నా.. జగన్ ఏకపక్ష ధోరణి మాత్రం మానుకోవడం లేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు జగన్ ప్రకటించారు. ఇక అసెంబ్లీ సమావేశాలను తనతో పాటు ఎమ్మెల్యేలు కూడా బహిష్కరిస్తారని పేర్కొన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది. అందుకు కార్యకర్తల అరెస్టులను కారణంగా పేర్కొంది. అయితే గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన తర్వాతనే టీడీపీకి ఊపిరి వచ్చిందన్న విషయాన్ని వైసీపీ అధ్యక్షుడు మర్చిపోయారు. ఆ క్రమంలో జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని స్పష్టమైందంటున్నారు.ఇక అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని జగన్ ఫిక్స్ అయ్యారు. 2024 శాసనసభ ఎన్నికల్లో వైసీపీ నుంచి పదకొండు మంది మాత్రమే గెలిచారు. వారితో ఏమాత్రం సంప్రదించకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి తాము అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నామని ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశమైంది. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేలలో కూడా ఈ నిర్ణయం కొంత అసంతృప్తికి దారి తీస్తుంది. కానీ జగన్ మాత్రం అధికారంలో ఉన్న తరహాలోనే వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా తాము తప్ప వేరే వారు లేరని.. తమను ప్రతిపక్షంగా ఎందుకు గుర్తించడం లేదని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. తమను ప్రతిపక్షంగా గుర్తించనపుడు అసెంబ్లీకి వెళ్లి లాభమేంటన్నారు. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించడం లేదంటే.. మైక్‌ను ఇవ్వబోమని అధికార పక్షం చెప్పినట్లేనని జగన్ చిత్రమైన లాజిక్ వినిపిస్తున్నారు. ప్రశ్నిస్తామనే భయంతోనే తమను ప్రతిపక్షంగా గుర్తించడం లేదని విమర్శిస్తున్నారు.అసెంబ్లీలో కనీసం పది శాతం సీట్లు ఉన్న పార్టీకే ప్రతిపక్షహోదా ఇస్తారు. ముందు నుంచి అదే సంప్రదాయం కొనసాగుతుంది. ఆ లెక్కన వైసీపీకి హోదా కావాలంటే కనీసం 18 మంతి ఎమ్మెల్యేలు ఉండాలి. కాని అయిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ మాత్రం ఆ విషయం తెలియనట్లు మంకుపట్టు పడుతూ విమర్శల పాలవుతున్నారు.మరోవైపు జగన్ చెల్లెలు షర్మిల సైతం జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అసెంబ్లీకి వెళ్లనివారు ఎవరైనా రాజీనామా చేయాల్సిందేనని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జగన్ అయినా, వైసీపీ ఎమ్మెల్యేలైనా రాజీనామా చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదని జగన్ ప్రకటించడంపై షర్మిల తీవ్రంగా ఫైర్ అయ్యారుబాయ్‌కాట్ నిర్ణయంపై అటు సొంత ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నా.. ఇతర పక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా జగన్ పట్టించుకునే పరిస్థితి కనపడదు. అయితే ఆయన ఇక్కడ చిన్నలాజిక్ మిస్ అవుతున్నారు. అసలు ఈ టర్మ్‌లో అసెంబ్లీకే రామని ఆయన ప్రకటించారు. నిర్ధిష్ట గడువులోగా ఏ ఎమ్మెల్యే అయినా అసెంబ్లీకి హాజరు కాకపోతే చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కి ఉంటుంది. సరైన రీజన్ చూపించకుండా ఎగ్గొడితే అనర్హత వేటు వేస్తారు. అందుకే పక్క రాష్ట్రంలో అసెంబ్లీకి ముఖం చాటేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరు నెలలు తిరిగే సరికి బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సభలో ప్రత్యక్షమయ్యారు. మరి ఆ విషయం తెలియనట్లు జగన్ బాయ్‌కాట్ నిర్ణయం ప్రకటించారు. తనతో పాటు మిగిలిన పది మంది ఎమ్మెల్యేలను కూడా రిస్క్‌లో పడేస్తున్నారు. మరి అనర్హత వేటు భయంతో మున్ముందు అసెంబ్లీకి హాజరైతే అప్పుడేం సమాధానం చెప్తారో చూడాలి