రెండు ఏటీఎంలను ధ్వంసం చేసిన దొంగలు
సిరా న్యూస్,పెద్దపల్లి;
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో దొంగలు హల్ చల్ చేశారు. పారిశ్రామిక ప్రాంతంలోని గౌతమి నగర్ ఎస్బిఐ ఎటిఎం ను గ్యాస్ కట్టర్ తో ధ్వంసం చేసి అందులో ఉన్న లక్షలాది రూపాయలు ఎత్తుకెళ్లారు. అలాగే గోదావరిఖని పట్టణ శివారు గంగానగర్ ఏటీఎం ను పగలగొట్టేందుకు ప్రయత్నం చేశారు. గౌతమీ నగర్ లో ఉన్న ఏటీఎంలో సుమారు 15 లక్షల వరకు డబ్బులు ఉన్నట్లు సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస రావు, పోలీసు అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా దొంగలు హల్ చల్ చేయడంతో పోలీసులు సవాల్ గా తీసుకొని దొంగల కోసం వేట ప్రారంభించారు. అయితే గౌతమి నగర్ లో ఉన్న ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరా కు స్ప్రే చల్లి గ్యాస్ కట్టర్ తో మిషన్ ను కట్ చేసి చాకచక్యంగా చోరికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన అర్ద రాత్రి ఒకటిన్నరకు జరిగినట్లు సీసీ కెమెరాలు రికార్డు అయిన దృశ్యాలను బట్టి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.