సిరా న్యూస్;
తమిళనాడులో దివంగత నేత ఎం కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అనంతరం వారసుడు ఎవరు అన్నదీ పెద్ద ఎత్తున చర్చ నడిచింది. చర్చ అనడం కన్నా అదో పెద్ద వివాదం అని చెప్పొచ్చు..! అప్పటికే డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్, తన వారసుడు అంటూ కరుణానిధి స్వయంగా ప్రకటించారు. పెద్ద కుమారుడైన అలగిరి కరుణానిధి వారసత్వం కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడే వారసుడిగా తన అనంతరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా 2009 లోక్‌సభ ఎన్నికల అనంతరం డిప్యూటీ సీఎంగా స్టాలిన్‌ను ఎంపిక చేశారు.కరుణానిధి ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరించకపోవడం అటు పార్టీ ఇటు ప్రభుత్వం రెండు విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటాడన్న వ్యూహంతో ఆ రోజు కరుణానిధి ఆ నిర్ణయం తీసుకున్నారు. కరుణానిధి మరణానంతరం స్టాలిన్‌కు పార్టీ పగ్గాలు చేజిక్కించుకునేందుకు సీఎం అయ్యేందుకు ఆ రోజు కరుణానిధి నిర్ణయం ఎంతగానో దోహదపడింది. ప్రస్తుతం స్టాలిన్ కూడా అదే ఆలోచనతో తన కుమారుడు ఉదయినిధి స్టాలిన్‌కు వారసత్వం అందాలన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే ఉదయనిధికి మంత్రివర్గంలో చోటు కల్పించిన స్టాలిన్, ఏకంగా డిప్యూటీ సీఎం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న స్టాలిన్ ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించాలంటే మంత్రిగా కంటే ఉపముఖ్యమంత్రిగా ఉండడం మంచిదన్న ఆలోచనతో స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోందిఅలాగే 2026 లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కూడా డీఎంకేకు ప్రతిష్టాత్మకం రానున్నాయి. తమిళనాడులో డీఎంకే ఏఐడీఎంకే ప్రధాన పార్టీలుగా ఉండగా వచ్చే ఎన్నికల్లో ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన పార్టీ కూడా బరిలో ఉండబోతోంది. దాంతో పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే స్టాలిన్ తోపాటు తన అనుకున్న ముఖ్యమైన వారు పార్టీ బాధ్యతలను షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2009లో లోక్‌సభ ఎన్నికలు పూర్తైన వెంటనే అప్పట్లో ఎమ్కే స్టాలిన్ డిప్యుటీ సీఎం అయ్యారు. ఆ తరవాత సీఎం అయ్యారు. ఇదే సెంటిమెంట్‌ని ఫాలో అవుతూ ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్‌ని డిప్యుటీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టనున్నారు.చెపాక్ తిరువళ్లికెని నియోజకవర్గం నుంచి MLAగా గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్ 2022 డిసెంబర్లో కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిజానికి ఇప్పటికే ఆయనకు ఈ పదవి దక్కాల్సింది. కానీ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల పొలిటికల్‌గా కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాంటి సమయంలో పదవి ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో హైకమాండ్ ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇప్పుడు అంతా క్లియర్ కావడం వల్ల ఉప ముఖ్యమంత్రిని చేయాలని పట్టుదలతో ఉన్నారు ఎమ్కే స్టాలిన్. ఈ ఏడాది జనవరిలో ఉదయ నిధి స్టాలిన్ పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం డెంగీ, మలేరియా లాంటిదని అలాంటి వ్యాధుల్ని అంతం చేయాలని నోరు జారారు. కులం పేరుతో వివక్ష ఎందుకని ప్రశ్నిస్తూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ సంచలనం సృష్టించాయి. ఈ వివాదం కోర్టుల వరకూ వెళ్లింది. ఉదయనిధి స్టాలిన్‌ని కోర్టులు మందలించాయి కూడా. సుప్రీంకోర్టు కూడా కలగజేసుకోవాల్సి వచ్చింది. ఇదంతా సద్దుమణిగింది అనుకునేలోగా ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. కల్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం కలకలం రేపింది. కల్తీ మద్యం సేవించి దాదాపు 65 మంది ప్రాణాలు కోల్పోయారు.లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఈ ఘటన జరగడం ప్రభుత్వానికి సవాల్ విసిరింది. అప్పటికప్పుడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ రావాల్సిన చెడ్డ పేరు వచ్చింది. అయితే…ఉదయనిధి స్టాలిన్‌ని డిప్యుటీ సీఎం చేసే విషయంలో ఎమ్కే స్టాలిన్‌దే తుది నిర్ణయమని పార్టీలోని కీలక నేతలు స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నిత్యం విమర్శలు గుప్పిస్తుంటారు ఉదయనిధి స్టాలిన్. లోక్‌సభ ఎన్నికల్లో గట్టిగా ప్రచారం చేశారు. పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. మదురైలో AIIM ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పి కేంద్రం మోసం చేసిందంటూ చేసిన ప్రచారం బాగానే కలిసొచ్చింది. ప్రస్తుతానికి పార్టీని ముందుండి నడిపించే సత్తా ఉదయనిధికి ఉందని సీఎం భావిస్తున్నారుఅందుకోసమే వీలైనంత త్వరగా డిప్యూటీ సీఎం చేయడం, ఇటు పార్టీకి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలకు సులువుగా ఉంటుందని స్టాలిన్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.మరోవైపు గతంలో తండ్రి కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడే డిప్యూటీ సీఎం అయ్యాక పార్టీలో స్టాలిన్ మంచి పట్టు సాధించగలిగారు. ఇప్పుడు తన కుమారుడు ఉదయినిధి స్టాలిన్‌కు కూడా అదే ఫార్ములా ఉపయోగపడుతుందని గట్టిగా భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా ప్రకటన రానప్పటికీ డీఎంకేలో కీలక నేతల ద్వారా అందిన సమాచారం మేరకు వీలైనంత త్వరగా స్టాలిన్ తన నిర్ణయాన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తోంది.