సిరా న్యూస్,కడప;
సార్వత్రిక ఎన్నిలకు కేడర్‌ను సన్నద్ధం చేసేందుకు అధికార వైసీపీ సిద్ధం పేరుతో నిర్వహించనున్న మూడో సభకు రాయలసీమ వేదికగా మారింది. తొలి సభను ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ పరిధిలోని సంగివలసలో నిర్వహించగా, రెండో సభను ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించి ఏలూరు పరిధిలోని దెందూలూరు నియోజకవర్గం దగ్గరలో నిర్వహించారు. రెండు చోట్ల భారీ ఎత్తున కేడర్ హాజరు కావడంతో సభలు గ్రాండ్ సక్సెస్ అయినట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. మూడో సభను సీఎం జగన్మోహన్‌రెడ్డి సొంత అడ్డాగా చెప్పుకునే రాయలసీమలో వైసీపీ నిర్వహిస్తోంది. రాయలసీమలోని అనంతపురం జిల్లా పరిధిలోని రాప్తాడు నియోజకవర్గంలో ఈ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11 మూడో సిద్ధం సభను నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన రెండు సభలకు ధీటుగా ఈ సభను నిర్వహించేందుకు అధికార వైసీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. కనీసం ఐదు లక్షల మందితో సభ నిర్వహించనున్నట్టు వైసీపీ నాయకులు చెబుతున్నారు. రాప్తాడు మండల కేంద్రంలోని ఆటో నగర సమీపంలో రాయలసీమ స్థాయలో సభను నిర్వహిస్తున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను వైసీపీ ముఖ్య నేతలు పరిశీలించారు. బహిరంగ సభా స్థలి వద్ద జరుగుతున్న ఏర్పాట్లపై సోమవారం సాయంత్రం, మంగళవారం ఉదయం అనంతపురం, రూరల్ డీఎస్సీలు, ఇతర అధికారులతో ముఖ్య నాయకులు సమీక్షించారు. సీఎం ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాంతోపాటు ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌తోపాటు ఇతర ముఖ్య నేతలు అధికారులతో చర్చించి ఏర్పాట్లను పరిశీలించారు. సభకు భారీ ఎత్తున కార్యకర్తలు వచ్చే అవకాశమున్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. ఇక్కడ సభను గ్రాండ్ సక్సెస్ చేయడం ద్వారా జగన్మోహన్‌రెడ్డికి రాయలసీమ బెల్ట్‌లో తిరుగులేదన్న విషయాన్ని మరోసారి తెలియజేయాలని ఇక్కడి నేతలు భావిస్తున్నారు. సభను విజయవంతం చేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు.. అందుకు అనుగుణంగా కేడర్‌ను సభకు తీసుకురావడంపై దృష్టి సారించారు.