సిరా న్యూస్,రాజమండ్రి;
ఒకప్పుడు ఆయన ఏపీ మాజీ సీఎం జగన్ కు కుడిభుజం. చిన్న వయసులోనే రాజకీయాలలోకి వచ్చి వైఎస్ఆర్ సీపీ తరపున ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. రాజకీయ అరంగేట్రమే భారీ మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించడం విశేషం. అయితే ఈ సారి అదే పార్టీనుంచి రాజమండ్రి అర్భన్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ఆయనే మార్గాని భరత్ రామ్. పలు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ జనంలో మంచి పేరే సంపాదించుకున్నారు. అంతేకాదు అప్పట్లో వైఎస్ జగన్ పాదయాత్రకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించి జగన్ కు అండగా నిలిచారు.భరత్ పై నమ్మకంతో జగన్ ఆయనను వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ ప్రతినిధిగా నియమించారు. కరోనా సమయంలోనూ భరత్ ప్రజల మధ్యే ఉంటూ పలు సేవలు అందించి ప్రశంసలు పొందారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్, చంద్రబాబు ఇటీవల హైదరాబాద్ లో భేటీ అయిన విషయం విదితమే. వారి భేటీపై భరత్ విమర్శలు గుప్పించారు. పలు సందేహాలు కూడా వ్యక్తం చేశారు. అసలు విభజన సమస్యలు గాలికి వదిలేసి పనికిరాని అంశాలపై చర్చించారని మండిపడ్డారు. పైగా పరిష్కరించవలసిన తక్షణ సమస్యలపై చర్చించకుండా వదిలేశారని అన్నారు.కేంద్రం నుంచి ఏ ఒక్క ప్రతినిధి లేకుండా కేవలం వీరిరువురే చర్చించడం శోచనీయం అన్నారు. కేంద్రం తరపున ఎవరినైనా మధ్యవర్తిగా పిలిపించుకుంటే బాగుండేదని అన్నారు. అవన్నీ బాగానే ఉంది గానీ హఠాత్తుగా జనసేనాని పవన్ కళ్యాణ్ పై మార్గాని భరత్ తెగ అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ భేటీకి పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జనసేనాని కృషితోనే ఏపీలో కూటమి చెలిమికి బీజం పడిందని..నాడు పవన్ పూనుకోకపోతే టీడీపీకి , బీజేపీకి మెజారిటీ స్థానాలు వచ్చేవా అంటూ పవన్ కళ్యాణ్ ను ఏకంగా ఆకాశంలోకి ఎత్తేస్తున్నారు.జగన్ అధికారంలో ఉన్పప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేశారు. జగన్ కు పవన్ కు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ద్వేషించుకున్నారు. అలాంటిది ఇప్పుడు భరత్ జనసేనానిపై కురిపిస్తున్న ప్రేమ వెనుక రాజకీయ కోణం ఏదైనా ఉందా అని అందరూ అనుకుంటున్నారు. పైగా త్వరలో భరత్ జనసేన కండువా మార్చుకోనున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే భరత్ తండ్రి ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఉండేవారు. చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ప్రసన్నం చేసుకుని జనసేన పార్టీలో చేరి మళ్లీ జనానికి చేరువవుదామని భావిస్తున్నారు భరత్ అని రాజకీయ విమర్శకులు, నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
===============================