సిరాన్యూస్, చిగురుమామిడి
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి
* నిరుపేద దంపతుల ఆవేదన
* ఆరుబయటేనే జీవనం
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామానికి చెందిన ఆవదూత తిరుపతి లావణ్య దంపతులు తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తాము ఉంటున్న ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో ఆరుబయటే జీవనం కొనసాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఇద్దరు పిల్లలు శరణ్య రెండవ తరగతి,తేజ మూడో తరగతి స్తానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు.తిరుపతి లావణ్య దినసరి కూలీలుగా పని చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటున్నారు. నిరుపేద కుటుంబం రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. కూలిపోయిన ఇంట్లో కరెంటు లేదు. పక్కవారింటి నుంచి ఒక్క బుగ్గ కరెంట్ కనెక్షన్ తీసుకున్నారు. రాత్రిపూట విష కీటకాలు, పాములు, తేలు వస్తున్నాయని. ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అని భయపడుతున్నామని తెలిపారు. కూలిన ఇంట్లో పాముల పుట్ట కూడా ఉంది.పాములు ఎప్పుడు వస్తాయో అని ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వ హాయంలో గృహలక్ష్మి పథకంలో కూడా ఇల్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు కూలిపోయినందుకు రెవిన్యూ శాఖ నుండి కూడా ఇప్పటివరకు ఏలాంటి ఆర్థిక సాయం అందలేదని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేసి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తాత్కాలికంగా చిన్న షెడ్డు నిర్మించడానికి ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నారు.