సిరా న్యూస్;
అంతర్జాతీయ జంతువుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబరు 4న నిర్వహిస్తారు. జంతుసంపదను పరిరక్షించడం, వాటిని వృద్ధి చేయడంతోపాటు జంతువుల హక్కులను కాపాడటం ఈ దినోత్సవ ముఖ్యోద్దేశం. అంతర్జాతీయ జంతు దినోత్సవం హీన్రిచ్ జిమ్మెర్మాన్ చే ఆవిర్భవించబడింది. అతను 1925, మార్చి 24న జర్మనీలోని బెర్లిన్ లో తొలిసారిగా దీనిని నిర్వహించాడు. దీనికి 5,000 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. అనంతరం ఇది 1929లో అక్టోబరు 4కు మార్చబడింది. ప్రతి సంవత్సరం హీన్రిచ్ జిమ్మెర్మాన్ చేసిన కార్యక్రమాల, ప్రచారం కారణంగా 1931, మే నెలలో ఇటలీలోని ఫ్లోరెన్స్ లో జరిగిన అంతర్జాతీయ జంతు రక్షణ సదస్సులో అక్టోబరు 4ను అంతర్జాతీయ జంతు దినోత్సవంగా ఏకగ్రీవంగా అమోదించడం జరిగింది. పర్యావరణ పరిరక్షకుడిగా పేరుగాంచిన సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి స్మారకాన్ని పురస్కరించుకొని అక్టోబరు 4న ప్రపంచ జంతు దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ దినోత్సవం రోజున జంతు సంక్షేమ ప్రచారంతోపాటుగా జంతు పరిరక్షక శిబిరాలను ప్రారంభించడం, జంతు సంరక్షణకు నిధులు సేకరించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.