సిరా న్యూస్,మడకశిర;
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం భక్తరహళ్లిలో దాదాపుగా వంద సంవత్సరాలుగా ఓ వింత ఆచారం కొనసాగుతూనే ఉంది. భక్తరహళ్లిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామికి ప్రతి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలలో భాగంగా భూతప్పల ఉత్సవం నిర్వహిస్తారు. ఈ భూతప్పల ఉత్సవాలలో భాగంగా భక్తులు తెల్లవారుజామునే చన్నీళ్ళతో స్నానం చేసి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముందర తెల్ల వస్త్రాలు ధరించి తడి గుడ్డలతో బోర్లా పడుకుంటారు. భూతప్పల వేషధారణలు హాహాకారాలు చేసుకుంటూ వచ్చి, బోర్లా పడుకున్న భక్తులను తొక్కుకుంటూ వెళతారు. దీర్ఘకాలిక రోగాలు వున్నా, పంటలు సరిగా పండకపోయినా, ముఖ్యంగా పిల్లలు కాని వారు ఎక్కువ శాతం ఈ కార్యక్రమంలో హాజరవుతారు. పిల్లలు కాని వారికి భూతప్పల కాలిస్పర్శ తగిలితే పిల్లలు పుడతారని భక్తులకు ప్రగాఢ నమ్మకం.
ఇంతకీ ఈ భూతప్పలు ఎవరు… ఎక్కడినుండి వస్తారంటే…. 100 సంవత్సరాల క్రితం నుండి గొల్ల కులానికి చెందినవారు తమ వంశంలోని ఇద్దరు వ్యక్తులు వంశంపారపర్యంగా ఇప్పటివరకు ఈ భూతప్పల వేషధారణలతో భూతప్పులుగా సేవలు చేస్తున్నారు. వంద సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఎంతోమంది భక్తులకు శ్రీ లక్ష్మీనరసింహస్వామిగా దర్శనమిస్తున్నాడు. ఈ భూతప్పల ఉత్సవానికి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ,తెలంగాణ నుండి వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈ భూతప్పలు కాలి స్పర్శ అయిన తరువాత జ్యోతులతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారికి పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళతారు.