సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవీ రేంజ్ పరిధిలోని ముసలిమడుగు బీట్ లో వేటగాళ్ల వేసిన ఉచ్చులో పడ్డ పెద్దపులికి వెటర్నరీ వైద్యుల సమక్షంలో చికిత్స అందిస్తున్నారు. గత నెల 25న వేటగాళ్లు వేసిన ఉచ్చలో పెద్దపులి చిక్కుకుంది అయితే పులి ఉచ్చును పెకిలించుకొని ఉచ్చుతో సహా అడవిలో తిరుగుతుండగా ట్రాప్ కెమెరాల్లో ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. గత పది రోజుల నుంచి మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఫారెస్ట్ అధికారులు దాదాపు 50 మంది సిబ్బందితో కలిసి శ్రమించి రిస్క్యూ ఆపరేషన్ నిర్వహించి పులికి మత్తుమందు ఇచ్చి బోనులో బంధించి ఉచ్చును ఫారెస్ట్ అధికారులు తొలగించారు. అనంతరం గాయపడిన పెద్ద పులిని బైర్లుటి సమీపంలోని నాగులుటి బేస్ క్యాంపుకు తరలించి గత మూడు రోజులుగా వెటర్నరీ వైద్యుల సమక్షంలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన పెద్ద పులి ఆడదని దాని వయస్సు మూడు సంవత్సరాలు ఉంటుందని టైగర్ నెంబర్ 128 గా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పెద్ద పులి గాయం నుండి పూర్తి గా కోలుకున్న అనంతరం ఫారెస్ట్ అధికారులు తిరిగి యధావిధిగా అడవిలో వదిలిపెట్టనున్నారు. పెద్ద పులి ఆరోగ్య స్థితిని బట్టి అవసరమైతే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం కోసం తిరుపతి జూకు తరలించే యోజనలో ఉన్నట్లు తెలుస్తోంది
===================