సిరాన్యూస్, చర్ల
ఆదివాసీ మహిళలు ఆర్థిక ప్రగతిని సాధించాలి: ట్రైకార్ జీఎం శంకర్‌రావు
* ఇసుక ర్యాంపుల తనిఖీ
ఆదివాసీ మహిళలు సొంతంగా ఇసుక ర్యాంపులు నడుపుకొని జీవనోపాధి పెంపొందించుకొని తమ గ్రామాలలోని కుటుంబాలకు ఉపాధి అవకాశాలు పొందడానికి ఆ గ్రామంలోని గిరిజనులకే అవకాశం కల్పించడం జరిగిందని గిరిజన సంక్షేమ శాఖ ట్రైకార్ జీఎం శంకర్రావు అన్నారు. బుధవారం తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదేశాల మేరకు దుమ్ముగూడెం మండలంలోని నందుల చలక, చర్ల మండలంలోని పెద్దపల్లి ఇసుక ర్యాంపులను గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, మైనింగ్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ మహిళలతో వారు మాట్లాడుతూ ఇసుక ర్యాంపుల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇసుక ర్యాంపులు నిర్వహించే మహిళలు ఆ గ్రామానికి సంబంధించిన వారే ఉండాలని, బినామీలను ఎవరిని దరిచేరకుండా చూడాలని, ఇసుక సరఫరాకు సంబంధించిన ప్రతిదీ రిజిస్టర్లో నమోదు చేయాలని ఆయన మహిళలకు సూచించారు. మహిళలు ఇసుక ర్యాంపుల పూర్తి బాధ్యత తీసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని అన్నారు. కార్యక్రమంలో ఐటిడిఏ పరిపాలన అధికారి రాంబాబు, డీఎస్ఓ ప్రభాకర్ రావు పాల్గొన్నారు.