అసెంబ్లీకి వెళ్దామంటూ సూచనలు
సిరా న్యూస్,విజయవాడ;
అసెంబ్లీకి వెళ్లేదే లేదని పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఓ మాట అడగకుండా సొంతంగా నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. వచ్చింది 11 సీట్లే అవడంతో టెక్నికల్ గా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కదు. మరి 40 శాతం ఓట్ షేర్ దక్కించుకున్న పార్టీ ప్రజల పక్షాన సభలో ఎలా నిలబడాలో తెలియదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. సభలో ఏదో జరుగుతుందని లేనిపోని డౌట్లు పెట్టుకుని వెళ్లకుండా ఉండడం ఏంటని అంటున్నారు. చంద్రబాబుకు 23 మంది సభ్యులు ఉన్నారు. ఐదుగురిని లాగేస్తే 17-18 మంది అవుతారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు లాగేద్దాం అని కొందరన్నారని, అలా చేసి ఉంటే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండేది కాదు. అక్కడ కూర్చుని ఉండేవారు కాదంటూ మాట్లాడారు. అంటే ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఏ పార్టీకైనా 10 శాతం సీట్లు ఉండాలన్నది అందరికి తెలిసిన లెక్కే కదా. మరి ఇప్పుడు 11 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదా అడగడమే అసలైన వింతవాదన.ఇప్పుడు అసలు టాపిక్ ఏంటంటే.. అసెంబ్లీకి వెళ్లేది లేదని జగన్ అంటున్నారు. దూరంగా ఉంటున్నారు కూడా. కారణం.. అందరు ఎమ్మెల్యేల మాదిరే తనకు కూడా 2 నిమిషాలే మైక్ ఇస్తారని, కావాలనే తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని చెబుతున్నారు. మాజీ సీఎం అసలు అసెంబ్లీకి వెళ్లను అనడానికి ఇదే మెయిన్ రీజనా.. మరేదైనా ఉందా అన్న విషయం చుట్టూ చర్చ జరుగుతోంది. అయితే తెరవెనుక లెక్కలు చాలానే ఉన్నాయంటున్నారు. ఏపీ అసెంబ్లీలో సీట్లు గెలిచినవి నాలుగే పార్టీలు. అందులో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అవి అధికార పక్షం. మరి సభలో ప్రజా సమస్యలపై మాట్లాడాల్సింది వైఎస్సార్ సీపీ మాత్రమే. కానీ తాము అక్కడ మాట్లాడం.. సభ బయటే మాట్లాడుతాం అంటోంది వైసీపీ. నిజానికి అసెంబ్లీకి వెళ్లకూడదు అన్న నిర్ణయం తీసుకోవడంపై వైసీపీలో అంతర్గతంగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి.ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి. నేను అక్కడికి రాను.. ఇక్కడికి రాను.. అనడం ప్రజాస్వామ్యానికే పెద్ద ముప్పు అన్న వాదన కూడా పెరుగుతోంది. రైట్.. వైసీపీ అధినేత జగన్ సభకు వెళ్లకూడదని బలమైన నిర్ణయం తీసుకున్నారు. బాగానే ఉంది.. మరి మిగితా 10 మంది ఎమ్మెల్యేల అభిప్రాయం అసలు తీసుకున్నారా లేదంటే ఏకపక్షంగా తన నిర్ణయాన్ని అందరిపై రుద్దారా అన్న చర్చ పార్టీలో అంతర్గతంగా నడుస్తోంది. కొత్త ప్రభుత్వం వచ్చి ఆర్నెళ్లు కూడా కాలేదు. ఇప్పటి నుంచే సభకు వెళ్లకుండా ఉండడం అంటే రాజకీయంగా పార్టీకి పెద్ద దెబ్బే పడుతుందన్నది టాక్. ప్రజాస్వామ్యబద్ధంగా ఎమ్మెల్యేగా ఎన్నికై… ప్రజాసమస్యలు ప్రస్తావించాల్సిన అసెంబ్లీకి హాజరుకాకపోతే ప్రజలు మనల్ని క్షమించరేమో అని అటు ఓడిపోయిన ఎమ్మెల్యేలు, గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు తెగ బాధపడిపోతున్నారట.ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అదే ప్రజల తరఫున ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాల్సింది పోయి ఇలా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణాలతో అసెంబ్లీకి వెళ్లకపోవడం ఏంటని మదనపడిపోతున్నారట. ఇలా చేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజల దగ్గరకు ఏ ముఖం పెట్టుకుని వెళ్తాం అన్నది కూడా లోలోన ఇబ్బందిపెడుతున్న మ్యాటర్. గతంలో 151మంది ఎమ్మెల్యేల బలం వైసీపీకి ఉన్నపుడు కేవలం 23సీట్లు మాత్రమే గెలిచిన చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారని అలాంటప్పుడు మనం మాత్రం ఎందుకు హాజరుకాకూడదన్న పాయింట్ చుట్టూ వైసీపీలో సీరియస్ గా చర్చ సాగుతోందంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా.. వద్దా అన్న విషయంపై తమ అభిప్రాయం తీసుకోకుండా.. జగన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం చుట్టూ కూడా ఇంటర్నల్ గా డిస్కషన్ నడుస్తోందంటున్నారు.సభకు ఎందుకు వెళ్లొద్దో.. అధినేతను నేరుగా పట్టుకుని అడగలేరు. అదే సమయంలో తమ నియోజకవర్గాల్లో ప్రజలకు సరైన జవాబు చెప్పలేరు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, మైక్ 2 నిమిషాల్లోనే కట్ చేస్తారని చెప్పడం ఏమాత్రం ప్రజలు నమ్మే విషయాలుగా కనిపించడం లేదు. అసలు సభకు వస్తే కదా.. మైక్ ఎన్ని నిమిషాల్లో కట్ చేస్తారో తెలిసేది అన్న పాయింట్ కూడా వినిపిస్తున్నారు. ఓవరాల్ గా ఏ లెక్కన చూసినా… అసెంబ్లీకి హాజరుకాకపోవడం అనేది.. పార్టీకి పెద్ద దెబ్బ అని దిగులుపడుతున్న పరిస్థితి. పైకి మాత్రం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్టు మాట్లాడుతున్నప్పటికీ.. అంతర్గతంగా మాత్రం నేతలంతా ఇదే అంశాన్ని చర్చించుకుంటున్నారట.గతంలో టీడీపీలో గెలిచిన 23మందిలో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిన తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత చంద్రబాబు ఒక్కరే.. అసెంబ్లీలో సింగిల్ గా ఉండి వైసీపీని ప్రశ్నించారని గుర్తుకు తెస్తున్నారు. ఆ నాడు వైసీపీకి చెందిన 151మంది ఎమ్మెల్యేలు ఒక పక్క.. చంద్రబాబునాయుడు మాత్రమే మరోపక్క నిలబడి వాయిస్ వినిపిస్తే… ఇప్పుడు 11 సీట్లతో ఉన్న వైసీపీ అసలు సభకే వెళ్లొద్దనుకోవడం కచ్చితంగా చారిత్రక తప్పు అవుతుందన్న వాయిస్ వినిపించుకుంటున్నారంటున్నారు. నిజానికి చంద్రబాబు సతీమణి గురించి సభలో తప్పుగా మాట్లాడడంతో ఆయన.. మళ్లీ సీఎం అయ్యాకే సభకు వస్తానని చెప్పారు.అయితే ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చారు. ఆ కాంటెక్ట్స్ వేరు. అంతెందుకు మాజీ సీఎం జగన్ విషయమే చూద్దాం. 2014-2019 మధ్య 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం, అందులో ఐదుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో 2017 అక్టోబర్ 25న నిర్వహించిన వైఎస్సార్‌సీపీ శాసన సభాపక్ష సమావేశంలో జగన్.. ఇక తాను అసెంబ్లీకి వెళ్లనని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని ప్రకటించారు. అప్పటి నుంచి అసెంబ్లీకి వెళ్లని జగన్ 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లతో సీఎం అయిన తర్వాతే శాసన సభలో అడుగుపెట్టారు. ఇలా నిర్ణయం తీసుకోవడం మరో లెక్క. కానీ ఇప్పుడు సీన్ చూస్తే ఎవరూ ఏమీ అనలేదు. ఎవరూ ఎవర్ని చేర్చుకోలేదు. అయినా సరే సంబంధం లేని టాపిక్ లు తెరపైకి తెచ్చి సభ నుంచి తప్పుకోవాలని చూస్తున్నారన్న పాయింట్ ను కూటమి పార్టీలు వినిపిస్తున్నాయి.ఇక అసెంబ్లీకి వెళ్లకుండా.. మీడియా ముందే ప్రభుత్వాన్ని నిలదీస్తానంటూ జగన్ చెప్పిన మాటని కూడా తప్పుబడుతున్నారట ఆ పార్టీ నేతలు. ఒకవేళ మీడియా ముందు మాత్రమే నిలదీస్తానన్న జగన్.. అన్ని మీడియా సంస్థల్ని ఆ ప్రెస్ మీట్లకు పిలవకుండా కేవలం తనకు అనుకూలంగా ఉండే వారిని మాత్రమే పిలిచి మాట్లాడితే అది కూడా మైనస్ అవుతుందంటున్నారు. ప్రెస్ మీట్లో చెప్పదలుచుకున్న విషయం చెప్పడం కాదు.. ప్రశ్నలు అడిగితే చెప్పే పరిస్థితి కూడా ఉండాలన్న వాయిస్ ను అటు సొంత పార్టీ నేతలు, ఇటు ప్రత్యర్థి పార్టీ నేతలు వినిపిస్తున్నారు. సో ఏ లెక్కన చూసుకున్నా… సభకు వెళ్లొద్దని మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అసలే కరెక్ట్ కాదన్న వాదనైతే వినిపిస్తోంది.