సిరా న్యూస్,హైదరాబాద్;
రాష్ట్రంలో ఉల్లి ధరలు వణికిస్తున్నాయి. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. దీంతో సామాన్యుల పాలిట శాపంగా మారింది. ప్రస్తుతం మార్కెట్ వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు.గతంలో ఉల్లి ధరలు కిలో రూ.20 వరకు పలికిన ధర.. ప్రస్తుతం నాలుగింతలకు ఎగబాకింది. దీంతో సామాన్యులు కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉల్లి సాగు గణనీయంగా తగ్గింది. మరోవైపు వేసిన పంటలు వరదల ధాటికి కొట్టుకుపోయాయి. రానున్న కాలంలో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్తులు చెబుతున్నారు.తెలంగాణ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఘాటెక్కాయి. దాదాపు అన్ని జిల్లాల్లోని మార్కెట్‌లలో రూ. 50 నుంచి 60 వరకు అమ్ముతుండగా.. స్థానిక దుకాణాల్లో కిలో ఉల్లి ధర రూ.70 కు పైగా విక్రయిస్తున్నారు. ఇటీవల టమాట ధరలు వణికించగా.. తాజాగా, ఉల్లి ధరలు పెరగడంతో సామాన్యులు బెంబోలెత్తుతున్నారు. ప్రస్తుతం అన్ని చోట్ల ఇవే ధరలు కొనసాగుతున్నాయి.ఇక, హైదరాబాద్ విషయానికొస్తే.. ఒక్కో మార్కెట్‌లో ఒక్కో రేటుకు విక్రయిస్తున్నారు. అయితే ఇతర దేశాలకు ఉల్లి ఎగుమతి కారణంగా మలక్ పేటకు వచ్చే ఉల్లి కూడా గణనీయంగా తగ్గింది. దీంతో హైదరాబాద్‌లోని పలు మార్కెట్‌లలో రూ. 70 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు, సామాన్యులు ఉల్లిని కొనడం తగ్గించుకున్నారు. ధరల పెరుగుదల ఫలితంగా అమ్మకాల పరిమాణం కూడా గణనీయంగా తగ్గిందని అంటున్నారు.ఉల్లి దిగుబడి తగ్గడంతో రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ చివరి వరకు ఉల్లి పంటలు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. దీంతో అక్టోబర్, నవంబర్ నెలలో భారీగా పెరుగుతాయని చెబుతున్నారు. వచ్చే వారంలో ఉల్లి ధరలు కిల రూ.80 వరకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ డిసెంబర్ నెలలో పంటలు చేతికి వస్తే.. ఈ ధరలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.హైదరాబాద్ మలకపేట మార్కెట్‌కు మహారాష్ట్ర, కర్ణాటక, మెదక్, కర్నూల్ నుంచి ఉల్లి విపరీతంగా వచ్చేది. వర్షాల నేపథ్యంలో కర్ణాటక నుంచి సైతం దిగుమతి పడిపోయింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఉల్లి సరఫరా కొరత ఏర్పడింది. మలకపేట, బోవెన్ పల్లి, మూసాపేట్, గుడిమల్కాపూర్ తో పాటు ఇతర మార్కెట్‌లకు సైతం గణనీయంగా తగ్గింది.