సిరా న్యూస్,గుంటూరు;
ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని కూటమి కట్టారు. భారీ విజయం సాధించడంలో కూటమినేతలందరూ పనిచేశారు. అగ్రనేతలు సమన్వయంతో పాలనాపగ్గాలు చేపట్టి ముందుకు సాగుతుంటే.. కింది స్థాయిలో మాత్రం కొన్ని చోట్ల ఆ పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ అభ్యర్ధి ఘన విజయం సాధించిన ఆ సెగ్మెంట్లో ఆ పార్టీ నేతలు తమను పట్టించుకోవడం లేదని బీజేపీ, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఒంటెద్దు పోకడలతో వారంతా గుర్రుగా కనిపిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి తమ ప్రభావం చూపిస్తామంటున్నారు. అసలా సెగ్మెంట్ ఏది? అప్పుడే అక్కడ ఆ పరిస్థితి ఎందుకొచ్చింది?కూటమి అఖండ విజయంతో పల్నాడు జిల్లాలో నాయకులంతా పదవులపై కన్నేశారు. నియోజకవర్గాల వారీగా టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల నేతలు తమ వర్గాల వారికి పదవులపై ఆశలు పెట్టుకుంటున్నారు. అయితే ప్రస్తుతం పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం కూటమినేతలలో అసంతృప్తి జ్వాలలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నరసరావుపేటలో టీడీపీ అభ్యర్ధి చదలవాడ అరవిందబాబు భారీ మెజారిటీతో గెలవడంతో కూటమినేతలంతా సహజంగానే పదవులపై ఆశలు పెట్టుకున్నారు.ఇలాంటి తరుణంలో టీడీపీ, జనసేనల మధ్య అప్పుడే విభేదాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ అరవింద్ బాబు ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. నరసరావుపేటకు చెందిన జనసేన ఇన్చార్జ్ ఆయన విజయానికి తనవంతు కృషి చేశారు. ఆ క్రమంలో కూటమిలో భాగంగా జనసేనకు కూడా నరసరావుపేట నియోజకవర్గం పరిధిలోని నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రావాలని జనసేన నేతలు కోరుతున్నారు.జనసేన పార్టీలో ఉండి కూటమి విజయానికి కృషి చేసిన వాళ్ళకి ప్రస్తుతం ప్రాధాన్యత లేకపోతుండటంతో జనసైనికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నరసరావుపేట నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులకు సంబంధించి టీడీపీ వారికే ప్రాధాన్యత ఉంటుందంటూ.. తమను పట్టించుకోక పోతుండటంతో జనసేన వర్గాలు అసహనంతోకనపిస్తున్నాయి. ఈ అంశాన్ని మంత్రి లోకేష్ దృష్టికి కూడా జనసేన నేతలు తీసుకెళ్లారంట. అందరికీ న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటామని లోకేష్ వారికి హామీ ఇచ్చారంటజనసేన ముఖ్యనేతలు కూడా అసంతృప్తిగా ఉన్న వారిని కాస్త ఓపిగ్గా ఉండాలని సూచించారంట. కలిసికట్టుగా పని చేసుకోవాలని రానున్న రోజుల్లో అందరికీ సమానమైన పదవులు దక్కుతాయని హామీ ఇచ్చారంట. ఏదేమైనా ఇలాంటి పరిస్థితి కొనసాగితే మాత్రం రానున్న రోజుల్లో నరసరావుపేట కేంద్రంగా కూటమిలో విభేదాలు మరింత పెరిగడం ఖాయమంటున్నారు. ప్రస్తుతానికి అయితే పర్లేదు గాని స్థానికి సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉండటంతో.. ఇలాంటి అంశాలు పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలకు కలిసి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.దాంతో పాటు నియోజకవర్గంలో వైసీపీలో అసంతృప్తితో ఉన్న నేతలు ఎక్కువగా టీడీపీ కంటే జనసేన వైపే అడుగులు వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారికి జనసేన గేట్లు తెరుచుకుంటే.. ఆ పార్టీ మరింత బలపడి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అవకాశాలు తగ్గిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అందర్నీ సమన్వయపర్చుకోవాల్సిన బాధ్యత నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందరావుపై ఉందని అయితే ఆయన టీడీపీలోని విభేదాలనే కంట్రోల్ చేయలేకపోతుండటం చర్చనీయాంశంగా మారింది.తాజాగా ఎమ్మెల్యే అరవింద్ బాబు ఇంట్లోనే తెలుగు తమ్ముళ్లు ఘర్షణ పడ్డారు. ఒక వర్గంపై దాడి చేసిన 43 మంది టీడీపీ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు నమోదు అయింది. నరసరావుపేట మండల పరిధిలోని ఇస్సపాలెం గ్రామానికి చెందిన అల్లూరు హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘర్షణలో హరికృష్ణకు తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. సొంతపని నిమిత్తం మాట్లాడేందుకు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన తనపై ఎమ్మెల్యే ముందే కొందరు దాడి చేసి కొట్టారని బాధితుడు చెప్తున్నారు.సొంత ఇంట్లో అంత జరిగితే క్షతగాత్రుడు హరికృష్ణ మంచి నీళ్లు అడిగినా కూడా ఇవ్వకుండా డాక్టర్ అయిన ఎమ్మెల్యే చదలవాడ ఆయన్ని తోసేసి లోపలకి వళలి తలుపులు వేసుకోవడం విమర్శల పాలవుతుంది. ఎమ్మెల్యే వైఖరిపై టీడీపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడానికి సిద్దమైంది బాధితులు వర్గం. ఆ క్రమంలో దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు లాంటి లీడర్ తర్వాత నరసరావుపేటలో టీడీపీ నంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చదలవాడ అరవిందబాబు లీడర్ షిప్ క్వాలిటీస్పై సొంత పార్టీ వారే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి అలాంటాయన పదవుల విషయంలో తమకు ఏం న్యాయం చేస్తారని జనసేన, బీజేపీ నేతలు అంటున్నారు. మరి ఈ పరిస్థుతుల్ని నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు ఎలా చక్కదిద్దుతారో చూడాలి.
================================