సిరా న్యూస్,విజయవాడ;
ఏపీలో వైసీపీ నేతలు కనిపించడం లేదు. రాష్ట్రంలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఒక్క బీజేపీ నేత కూడా అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల్లో బిజెపి ప్రాతినిధ్యం పెరిగింది. 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు గెలిచారు. ఒకరికి కేంద్రమంత్రి పదవి లభించింది. మరొకరికి రాష్ట్ర క్యాబినెట్లో చోటు దక్కింది. అయితే వారంతా తమ పదవులను హోదా గానే చూస్తున్నారు. బిజెపి తరఫున సేవలందించడం లేదు. ముఖ్యంగా వరద బాధిత ప్రాంతాల్లో టిడిపి తో పాటు జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. కానీ బిజెపి నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదు. బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి బాధితుల పరామర్శకు వచ్చారు. కానీ ఒకటి రెండు రోజులకే పరిమితమయ్యారు. కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ జాడలేదు. రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ అమెరికాలో ఉన్నారు. దీంతో బిజెపిలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పరిస్థితి ఉంది. కీలకమైన సమయాల్లో వారు ముఖం చాటేయడంతో ఒక రకమైన విమర్శ వ్యక్తమవుతోంది. బిజెపి నేతల తీరు ఇబ్బందికరంగా మారింది.విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా కనిపించడం తక్కువగా మారింది. ఒకే ఒక్క రోజు ఆయన బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించారు. తరువాత ఆయన కనిపించకుండా మానేశారు. ఢిల్లీ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. విజయవాడ ప్రజలు కష్టాల్లో ఉంటే.. ఆ ప్రాంత ప్రతినిధిగా ఉన్న సుజనా చౌదరి వ్యవహరించిన తీరు మాత్రం విమర్శల పాలవుతోంది. నియోజకవర్గ ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోకపోవడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సుజనా చౌదరి గెలుపుతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మారుతాయి అని భావించారు. కానీ ఇంతటి విపత్తులో కనీసం పట్టించుకోకపోవడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.వాస్తవానికి సుజనా చౌదరి రాష్ట్ర క్యాబినెట్లో చోటు ఆశించారు. మంత్రి పదవి దక్కుతుందని భావించారు. అందుకే ఎంపీగా పోటీ చేయకుండా.. ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే అనేక సమీకరణలను పరిగణలోకి తీసుకొని బిజెపి నుంచి సత్య కుమార్ యాదవ్ కు క్యాబినెట్లో తీసుకున్నారు. అప్పటినుంచి నైరాశ్యంలోకి వెళ్లిపోయారు సుజనా చౌదరి. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పదవిని ఆశించారు. కానీ చంద్రబాబు పెద్దగా ఆసక్తి చూపు లేదట. అప్పటినుంచి ఢిల్లీకే పరిమితం అయ్యారు సుజనా చౌదరి.పొత్తులో భాగంగా బిజెపికి ఛాన్స్ దక్కింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది పోయి.. బిజెపి నిర్లక్ష్యం చేస్తుండడం విమర్శలకు కారణమవుతోంది. శాసనసభలో బిజెపి ప్రాతినిధ్యం పెరిగింది. అటు ఎంపీలు ముగ్గురు గెలిచారు. కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గాల్లో చోటు దక్కింది. ఇటువంటి సమయంలో యాక్టివ్ గా ఉండి బిజెపిని అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి విపత్తు సమయంలో బిజెపి నేతలు యాక్టివ్ గా పనిచేసి.. కేంద్ర నిధులను సైతం రప్పిస్తే ప్రజలు గుర్తించే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ బిజెపి నేతలు అవేవీ పట్టించుకోకుండా ఎవరికి వారే అన్నట్టు ఉన్నారు.