సిరా న్యూస్,విజయవాడ;
: ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. అన్ని పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. ఈ తరుణంలో నేతలు భవిష్యత్తును వెతుక్కుంటూ పార్టీల్లో చేరుతున్నారు. తాజాగావంగవీటి రాధాకృష్ణ జనసేన లో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జనసేనకు పొత్తులో భాగంగా 21 స్థానాలను కేటాయించిన సంగతి తెలిసిందే. అందులో కృష్ణాజిల్లా అవనిగడ్డ ఉంది. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రాధా భావిస్తున్నట్లు సమాచారం. జనసేన తరపున పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి మధ్యవర్తిత్వంతో రాధా జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది.గత ఎన్నికల్లో విశాఖ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ తరఫున రాధా టికెట్ ఆశించారు. కానీ జగన్ టికెట్ ఇవ్వలేదు. మల్లాది విష్ణుకు కేటాయించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన రాధా టిడిపిలో చేరారు. అప్పటికే తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులు ఖరారు అయ్యారు. దీంతో ఆయన టిడిపి తరఫున ప్రచారానికి పరిమితం అయ్యారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. దీంతో రాధా సైలెంట్ అయ్యారు. యాక్టివ్ రాజకీయాలకు దూరమయ్యారు. ఈ ఎన్నికల్లో సైతం తెలుగుదేశం పార్టీ ఆయనకు టికెట్ కేటాయించలేదు. ఆయన ఆశిస్తున్న విజయవాడలోని నగర నియోజకవర్గాల్లో దాదాపు అభ్యర్థులు ఖరారు అయ్యారు. అటు వైసీపీ సైతం అభ్యర్థులను ప్రకటించింది. ఈ తరుణంలో రాధా చుట్టూ రకరకాల ప్రచారం జరిగింది. వైసీపీలోకి వెళతారని ఒకసారి.. జనసేనలో చేరతారని మరోసారి పెద్ద ఎత్తున టాక్ నడిచింది. కానీ ఆయన ఏ పార్టీలో చేరలేదు. అయితే ఇప్పుడు వల్లభనేని బాలశౌరి రిక్వెస్ట్ చేయడంతో జనసేన లో చేరతారని తెలుస్తోంది.2004లో రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తొలిసారిగా రాధాకృష్ణ పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో టీడీపీలోకి వెళ్లారు. అప్పటినుంచి టిడిపిలో కొనసాగుతున్నా యాక్టివ్ గా లేరు. ఈ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తారని టాక్ నడిచింది. కానీ హై కమాండ్ గద్దె రామ్మోహన్ రావు పేరును ప్రకటించింది. దీంతో రాధాకృష్ణను వైసీపీలోకి తీసుకెళ్లి మచిలీపట్నం ఎంపీ టిక్కెట్ కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ అక్కడ కూడా వైసీపీ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. ఈ తరుణంలో తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. రాధా జనసేనలో చేరి అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన రాధాను జనసేనలోకి తీసుకెళ్లి అవనిగడ్డ అసెంబ్లీ టికెట్ కేటాయించేలా జనసేన నాయకత్వం పై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
=====================