సిరాన్యూస్, ఉట్నూర్
సికిల్ సెల్ అనీమియా వ్యాధిని అరికట్టేందుకు కృషి చేద్దాం :ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
సికిల్ సెల్ అనీమియా వ్యాధి రాకుండా ప్రజలంతా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని కేబి కాంప్లెక్స్ లోని పీఎంఆర్సి భవనంలో నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఏలిమేషన్ మిషన్ – జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సికిల్ సెల్ అనీమియా పై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.సాధారంగా మనిషి రక్తకణాలు గుండ్రంగా ఉంటాయని, కానీ సికిల్ సెల్ అనీమియా వ్యాధి బారిన పడ్డ వ్యక్తులలో రక్తకణాలు కొడవలి ఆకారంలో ఉంటాయని అన్నారు. సికిల్ సెల్ అనీమియా ఉన్న స్త్రీ, పురుషులు ఒకరినొకరు పెళ్లి చేసుకోవద్దని ఆలా చేయడం వల్ల వారికీ పుట్టబోయే బిడ్డకు ఈ వ్యాధి వస్తుందని అన్నారు.ప్రతి నెల రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. జన్యుపరమైన మార్పులు వచ్చే ఈ రక్తహీనతకు మందులు లేవని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వ్యాధిపై ప్రజలకు వైద్యాధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల డాక్టర్లు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ రాథోడ్ జనార్దన్, అడిషనల్ డిఎంఎచ్ఓ కుడిమేత మనోహర్,విజయ్ కుమార్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్రం భాస్కర్,వైద్యాధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.