సిరాన్యూస్, చిగురుమామిడి
రైతు భరోసా పై అభిప్రాయ సేకరణ: సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి
చిగురుమామిడి రైతు వేదికలో బుధవారం సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి అధ్యక్షతన జిల్లా సహకార అధికారి సీనియర్ ఇన్స్పెక్టర్ వి నిర్మల పర్యవేక్షణలో రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు రైతుల నుండి అభిప్రాయాలను తీసుకున్నారు.ఈ సందర్భంగా పలువురు రైతులు వారి వారి అభిప్రాయాలను తెలియజేశారు. గతంలో ఇచ్చిన రైతుబంధు వలన సన్న చిన్న కారు రైతులకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని పెద్ద రైతులే బాగుపడ్డారని, సన్న చిన్న కారు రైతులకు పెట్టుబడి సహాయాన్ని పెంచాలన్నారు. మరికొందరు రైతులు గతంలో గుట్టలు, వెంచర్లు, వ్యవసాయేతర భూములకు రైతుబంధు ఇచ్చారని, ఈ ప్రభుత్వం ఇస్తున్న రైతు భరోసాలలో వారికి అవకాశం కల్పించవద్దన్నారు. అలాగే కొందరు రైతులు 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసాను వర్తింపజేయాలని తెలిపారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రైతుల నుండి సేకరించిన అభిప్రాయాలను పై అధికారులకు తెలుపుతామన్నారు. సాగు చేసే రైతులకు రైతు భరోసా వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రంజిత్ రెడ్డి, వైస్ చైర్మన్ కర్వేద మహేందర్ రెడ్డి, డైరెక్టర్లు చాడ శ్రీధర్ రెడ్డి, చిట్టుమల్ల శ్రీనివాస్, ముద్ర కోలా రాజయ్య, కూతురు శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.