సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదుల లొల్లి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మంత్రి పదవులు, పీసీసీ చీఫ్ స్థానాలను ఇప్పటి వరకూ భర్తీ చేయలేకపోయారు. తాజాగా కాంగ్రెస్ లో చేరిన కేకే రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం కోసం రేస్ ప్రారంభమయింది. ఆ స్థానం తనకే ఇవ్వాలని సీనియర్ నేత వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. గాంధీ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ టికెట్ తనకు ఇస్తే గెలిచేవాడినని కానీ తనకు టిక్కెట్ విషయంలో అన్యాయం చేశారన్నారు.ఎనిమిదేళ్లుగా తనకు ఎలాంటి పదవీ లేదని ఆయినా పార్టీ విజయానికి కృషి చేసానని తెలిపారు. త్వరలో రాజ్యసభకు జరగనున్న ఉపఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని పార్టీ హైకమాండ్ కు విజ్ఞప్తి చేసారు. కేకే రాజీనామా చేయడం వల్ల ఒక్క రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు ఉపఎన్నికలు నిర్వహిస్తే ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. అందుకే వీ హనుమంతరావు ముందుస్తుగానే గాంధీభవన్ లోనే ప్రెస్ మీట్ పెట్టి తన కోరికను వ్యక్తం చేశారు. అయితే తన రాజ్యసభ స్థానాన్ని మళ్లీ తనకు ఇచ్చే షరతుల మీదనే కేకే పార్టీ మారారాన్న ప్రచారం ఉంది. ఈ విషయంపై కాంగ్రెస్ వర్గాలు ధృవీకరించడం లేదు . కానీ పార్టీ మారగానే కేకే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఇంకా చెప్పాలంటే..ఆయన పార్టీలో చేరాల్సిన అవసరం కూడా లేదని అంటున్నారు. పార్టీ మారకుండానే పార్టీ నేతగా చెలామణి కావొచ్చు.. ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ ఇప్పటికే పార్టీ మారిపోయారు. కానీ విలువలు కాపాడినట్లుగా ఉంటుందని అలాగే.. తన రాజ్యసభ సీటు తనకు వస్తుందన్న నమ్మకంతోనే కేకే రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. కేకే అలా రాజీనామా చేయగానే ఇలా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు సలహాదారు పదవి ఇచ్చారు. కేబినెట్ హోదా కూడా ఇచ్చారు. ఈ కారణంతో ఆయన కాళీ చేసిన రాజ్యసభ సీటు ఆయనకు ఇవ్వకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వీ హనుమంతరావు తన ప్రయత్నం తాను చేసుకోవడానికి తెర ముందుకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఒకప్పుడు ఏఐసిసిలో ప్రముఖ నేతగా ఉన్న వీహెచ్ ఇప్పుడు ప్రాధాన్యం కోల్పోయారు. సీనియర్ నేతగా ఆయనకు గుర్తింపు ఇస్తున్నా.. పదవుల గురించి మాత్రం ఆయన పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు