సిరాన్యూస్, ఓదెల
ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి: ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
* లంబాడీతండాలో సీత్లా పండుగ వేడుకలు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం లంబాడీతండా గ్రామంలో మంగళవారం సీత్లా భవాని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతులు లంబాడి సంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో సందడి చేశారు. ఈసందర్బంగా సీత్లా పండుగకు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు హాజరయ్యారు. లంబాడీ తండా వాసులతో కలిసి మొక్కలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో సీత్లా భవానీ వేడుకలు నిర్వహించడం లంబాడీల తెగల ఆనవాయితీ అని తెలిపారు. తొలకరి విత్తనాలు వేసిన తర్వాత సీత్లా భవాని పండుగ జరుపుకుంటారని తెలిపారు. వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని పూజిస్తారన్నారు. సీత్లా భవాని పండగలో భాగంగ కోళ్లను, గొర్రెలు, మేకలను సీతాల భవానికి సమర్పిస్తారని చెప్పారు. ఆ తర్వాత నవధాన్యాలను పశువుల మీద చల్లి దాటిస్తారు, పంటలు పుష్కలంగా పండాలని, పశు సంపద పెరగాలని, అందరూ చల్లగా ఉండాలని సీతల భవానీకి మొక్కులు చెల్లిస్తారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లంబాడి తండా గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.