సిరా న్యూస్,ఇచ్చోడ
గొప్ప రూపకర్త విశ్వకర్మ : మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు తొగాడి లక్ష్మణ్
సకల వేదముల ప్రకారం విశ్వకర్మయే సృష్టికర్తని, తన కళ నైపుణ్యం ద్వారా ప్రపంచానికే భారతదేశ విశిష్టతను తెలియజేసిన గొప్ప రూపకర్త అని మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు తొగాడి లక్ష్మణ్ అన్నారు. స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో విశ్వకర్మ చిత్రపటానికి స్థానిక విశ్వకర్మ పెద్దలు పూలమాలలతో ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు తొగాడి లక్ష్మణ్ పచ్చరంగుల జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ దేవుడు, దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజున నిర్వహించే పండుగ. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న విశ్వకర్మ పూజను నిర్వహిస్తారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభుగా, ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డాడని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు సమన్ పెళ్లి సుదర్శన్ కే గోపి, ఆర్ గోపి, గుండయ్య, కృష్ణ, మహేష్, తదితరులు పాల్గొన్నారు.