సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఓటు కోసం విశాఖపట్నం నుంచి ఆదిలాబాద్ కు
+ ఆదర్శంగా నిలుస్తున్న కానిస్టేబుల్ గుమ్ముల శ్రీకాంత్, శ్రీలత దంపతులు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి వాడ కు చెందిన గుమ్ముల శ్రీకాంత్ వృత్తిరీత్యా సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తున్నారు. కాగా సోమవారం ఎన్నికలు ఉండడంతో విశాఖపట్నం నుండి తన సతీమణి శ్రీలత తో కలిసి నిజామాబాద్ వరకు ట్రైన్ లో వచ్చారు. నిజామాబాద్ నుండి ప్రత్యేకంగా కారు అద్దెకు తీసుకుని ఆదిలాబాద్ కు చేరుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని మహాలక్ష్మి వాడలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు కోసం ఎంతో వ్యయప్రయాసలు పడి విశాఖపట్నం నుండి ఆదిలాబాద్ కు చేరుకొని ఓటు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాజ్యాంగం ద్వారా లభించిన అత్యున్నతమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.