సిరా న్యూస్,హైదరాబాద్;
ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం దుర్మార్గమని.. అది చట్ట విరుద్ధమని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించడం విద్రోహక చర్య అని విమర్శించింది. వచ్చే జనవరి 6,7 , 8 తేదీలలో వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలో మూడు రోజులపాటు జరిగే తబ్లిగి జమతే సమావేశం చట్ట విరుద్ధమన్నారు. ఈ మేరకు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరినాథ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. బలవంతపు మత మార్పిడి, లవ్ జిహాద్ లను ప్రోత్సహిస్తూ సమాజంలో చిచ్చు పెట్టే ఇలాంటి కార్యక్రమాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీస్ యంత్రాంగం స్పందించి వెంటనే సమావేశం అనుమతిని రద్దు చేయాలన్నారు. లేదంటే విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలు విస్తృతమవుతున్నాయని ఆరోపించారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్నారు. టెర్రరిజం, ఇస్లాం వ్యాప్తి, ప్రలోభాలకు గురి చేస్తూ మతమార్పిడులకు పాల్పడటం వంటి కార్యక్రమాలకు శిక్షణ ఇచ్చే తబ్లిగీ జమాతే సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు కేటాయించడం ఏమాత్రం తగదు అన్నారు. నిధుల మంజూరు పై అవసరమనుకుంటే న్యాయపోరాటం చేస్తామని, హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.