ఎమ్మెల్యే విజయరమణారావు
సిరా న్యూస్,పెద్దపల్లి;
నియోజకవర్గ ప్రజలకు తాను రుణపడి ఉంటానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. నూతనంగా ఎన్నికైన ఆయన అసెంబ్లీలో ప్రమాణస్వీకార అనంతరం తొలిసారిగా పెద్దపల్లికి వస్తున్న సందర్భంగా ఆయనను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు గర్రెపల్లి గ్రామం నుండి బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. భారీ గజమాలతో సత్కరించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజక వర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపెడతానని పేర్కొన్నారు. సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను నియోజకవర్గంలోని ప్రజలకు అందే విదంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్య మంత్రి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే 2 గ్యారంటీలను అమలు చేశారన్నారు. 100 రోజుల్లో మిగతా 4 గ్యారెంటీలు అమలు చేసి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మాజీ చైర్మన్ ఎలువాక రాజయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.