వాలంటీర్ల ఫ్యూచర్ ఏంటీ…

సిరా న్యూస్,విజయవాడ;
ఎన్నికలకు ముందు..ఎన్నికల తర్వాత..వాళ్ల సెంట్రిక్‌గానే చర్చ. కొనసాగిస్తామని అధినేత హామీ. వద్దు సార్ వాళ్లుంటే పార్టీకి నష్టమని లీడర్లు..పెద్ద ఇష్యూనే నడుస్తుంది.ఏపీలో ఎప్పుడూ ఏదో ఒక హాట్ సబ్జెక్ట్ ఉండనే ఉంటుంది. అందులో వాలంటీర్ల ఇష్యూ ఒకటి. ఎన్నికలకు ముందు నుంచి వాలంటీర్ల సెంట్రిక్‌గానే చర్చ జరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతో వాలంటీర్లు ఎన్నికల ముందు విధుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.ఆశయం మంచిదే కానీ ఆచరణలో గాడితప్పింది. ఎంతలా అంటే వైసీపీ మంత్రులు, ప్రభుత్వ పెద్దలే వాలంటీర్లను వైసీపీ కార్యకర్తలుగా చెప్పుకునేంత దుర్వినియోగం చేశారు. దాంతో మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది. ఎన్నికలప్పుడు వాలంటీర్లతో రాజీనామా చేయించి వైసీపీ నేతలు పార్టీ కోసం పని చేయించుకున్నారు. ఆ విధంగా ఏపీలోని రెండున్నర లక్షల మంది వాలంటీర్లలో లక్ష మంది దాకా తప్పుకున్నారు.అధికారంలోకి వస్తే వాలంటీర్లను తమ ప్రభుత్వం వస్తే బాగా చూసుకుంటామని వారికి పది వేల గౌరవ వేతనం ఇస్తామని టీడీపీ కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ వాలంటీర్ల విషయంలో అయితే ఎటూ తేల్చడం లేదు. వారు ఉద్యమబాట పడతామని హెచ్చరిస్తున్నారు.మంత్రివర్గ సమావేశాల్లో వాలంటీర్ల ప్రస్తావన వస్తున్నా ఎటూ తేల్చలేకపోతున్నారు. వాలంటీర్ల వ్యవస్థతో వైసీపీకి మంచి కంటే చెడ్డ ఎక్కువ మూటకట్టుకుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. వాలంటీర్‌ వ్యవస్థను అమలు చేస్తే ప్రజా ప్రతినిధుల ప్రాధాన్యత తగ్గిపోతుందని కూడా భావిస్తున్నారు. అందుకే వారిని కంటిన్యూ చేయడానికి ఒప్పుకోవడం లేదు.సీఎం చంద్రబాబుకు మాత్రం వాలంటీర్ల వ్యవస్థ విషయంలో కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయని అంటున్నారు. వాలంటీర్లను కొనసాగించాలని ఆయన అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వాలంటీర్లలో నిజాయితీపరులను చిత్తశుద్ధి, పనితీరు బాగున్న వారిని కొనసాగించాలనుకుంటున్నారట. విద్యార్హతలు బట్టి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ల సేవలు వాడుకోవాలని సీఎం ఆలోచిస్తున్నారని అంటున్నారు.వాలంటీర్లను కొన్ని రకాల ప్రభుత్వ సేవల కోసం వాడుకోవడం ద్వారా..ప్రభుత్వానికి ప్రజలకు మధ్య బలమైన వారధిని ఏర్పాటు చేసుకోవాలని బాబు ఆలోచిస్తున్నారని అంటున్నారు. వాలంటీర్ల విషయంలో వైసీపీ చేసిన తప్పులు చేయకుండా బాగా నడిపిస్తే మంచి వ్యవస్థగా ఉంటుందని భావిస్తున్నారట. ఇక మొత్తం వాలంటీర్లను తీసుకోవడం కంటే రాజీనామా చేసిన వారిని పక్కన పెట్టాలనుకుంటున్నారు.మిగిలిన వారిలో కూడా అర్హత ఉన్నవారిని..అవసరమైన వరకే వాలంటీర్లను తీసుకుని మాట నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందని అంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థపై త్వరలో మంచి నిర్ణయం రాబోతుందన్న టాక్ వినిపిస్తోంది. నవంబర్ 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల కొనసాగింపు.. కొత్తవారి నియామకంపై డెసిషన్‌ తీసుకుంటారని అంటున్నారు. ఈసారి వచ్చే వాలంటీర్లు టీడీపీ శిక్షణలో తర్ఫీదు తీసుకుని జనంలోకి వెళ్తారని చెబుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *