శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్
సిరా న్యూస్,లక్నో ;
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య లో కొత్తగా నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవంపై రాజకీయ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మత పరమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారంటూ బీజేపీ, ప్రధాని మోదీపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రతిపక్ష నేతల విమర్శలపై శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందించారు. మోదీ చేస్తున్నది రాజకీయం (రాజనీతి) కాదని, అది ధర్మనీతి (ధర్మ మార్గం) అని అన్నారు. ‘రాజనీతి కాదు.. ధర్మనీతి. కొందరు ప్రధాని మోదీ గురించి చులకనగా మాట్లాడుతున్నారు. దానికి బీజేపీ సమాధానం చెబుతుంది. అయినా నేను ధర్మనీతికి చెందిన వాడిని. నేను చేయాల్సిందల్లా రామభక్తులకు సేవ చేయడమే. నేను ఓ పూజారిని. నాకు రాజకీయాలతో సంబంధం లేదు’ అంటూ వ్యాఖ్యానించారు.ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం) ప్రారంభోత్సవం ఈనెల 22న జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమం పేరుతో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రం రాజకీయం చేస్తోందని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. రామాలయ ప్రారంభోత్సవ వేడుకలను ఆరెస్సెస్, బీజేపీ పూర్తిగా మోదీ కార్యక్రమంగా మార్చాయని విమర్శిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రామాలయ ప్రారంభ వేడుకలను పొలిటికల్ ప్రాజెక్ట్‌గా కాషాయ పార్టీ మార్చిందని ఆరోపిస్తున్నారు. పూర్తి కాని ఆలయాన్ని ఎన్నికల ముందు ప్రారంభించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తాము దూరంగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పార్టీల నేతలు తేల్చి చెప్పేశారు. ఈ మేరకు ప్రాణ ప్రతిష్ట ఆహ్వానాన్ని కూడా తిరస్కరించారు.