సిరా న్యూస్;
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం… ఏపీ, తెలంగాణగా విడిపోయి వచ్చే నెల రెండో తేదీకి పదేళ్లు అవుతుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ఏపీ విభజిత భాగంగా మారింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీని ఆహ్వానించి సత్కరించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఏపీలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే మామూలుగానే జూన్ 2ను ఏప ప్రభుత్వాలు రాష్ట్ర అవతరణ దినోత్సవంగా చేయడం లేదు. కాబట్టి ఏపీ వైపు నుంచి జూన్ 2వ తేదీకి ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. తెలుగు రాష్ట్రాల విభజన జరిగి జూన్ 2వతేదీకి పదేళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ అనేక సమస్యలు పరిష్కారం కాలేదు. హైదరాబాద్‌తో సహా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. రాష్ట్ర విభజన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఆస్తుల విభజన, విద్యుత్ బిల్లుల బకాయిలు వంటి అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తుది పరిష్కారం కోసం వేచి చూస్తున్న సమస్యల్లో ఉద్యోగుల బదిలీ అంశం ఇప్పటికీ తేలలేదు. ఏపీకి కేటాయించిన 144మంది తెలంగాణ ఉద్యోగులు ఇంకా అక్కడే పనిచేస్తున్నారు. వారు తమను తెలంగాణకు పంపాలని కోరుతున్నారు. అలాగే ప్రభుత్వ ఆధీనంలోని రోడ్డు రవాణా సంస్థ ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఒక కొలిక్కి రాలేదు. రాజధాని నగరమైన హైదరాబాద్‌లో ఉన్న ఆర్టీసీ ఆస్తుల్లో వాటా కావాలని ఏపీ కోరిందని, దానికి టీఎస్ఆర్టీసీ నిరాకరించింది. హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ ఆస్తులు తెలంగాణకు చెందినవేనని . తెలంగాణ గడ్డపై ఉన్న ఆస్తుల్లో ఏపీకి వాటా ఎలా ఇస్తారని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం హైదరాబాద్ రాజధాని నగరం పూర్తిగా తెలంగాణకు చెందుతుంది. కానీ పదేళ్ల పాటు ఉమ్మడిగా ఉంటుంది. పదేళ్ల తర్వాత పూర్తిగా తెలంగాణ రాజధాని. అధికారిక వర్గాల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో జాబితా చేసిన వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన, అనేక అంశాలపై ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇంకా పూర్తి కాలేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు తొమ్మిదో షెడ్యూల్లో జాబితా చేశారు. చట్టంలోని 10వ షెడ్యూల్లో ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ యూనియన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఏపీ ఫారెస్ట్ అకాడమీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ,ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ వంటి 107 శిక్షణా సంస్థలు ఉన్నాయి. రిటైర్డ్ బ్యూరోక్రాట్ షీలా భిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీ షెడ్యూల్ 9,10 షెడ్యూల్ సంస్థల విభజనపై సిఫార్సులు చేసినప్పటికీ, ఈ అంశం అపరిష్కృతంగానే ఉంది. విభజన తర్వాత విద్యుత్ సరఫరాకు సంబంధించి బకాయిల చెల్లింపు విషయంలో కూడా రెండు రాష్ట్రాల మధ్య చర్చలు ముందుకు సాగలేదు. 2014వ సంవత్సరం జూన్ 2వతేదీ నుంచి 10 సంవత్సరాల కాలానికి హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్ ఈ ఏడాది జూన్ 2వతేదీ నుంచి తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. రాష్ట్ర విభజన సమస్యలపై మే 15వతేదీన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ఇచ్చిన హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ ప్రభుత్వ అతిథి గృహం వంటి భవనాలను జూన్ 2వతేదీ తర్వాత స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఈ విషయంలో ఏపీ అభ్యంతరం చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఈ ఏడాది మార్చి నెలలో కేంద్రం రెండు రాష్ట్రాలకు భూ కేటాయింపులు చేయడంతో ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌పై వివాదం సద్దుమణిగింది. విభజన చట్టం ఆధారంగా 58:42 ప్రకారం రెండు రాష్ట్రాలు భవన్ ఆస్తులు పంచుకున్నాయి. అశోకా రోడ్డుతో పాటు శ్రీమంత్ మాధవరావు సింథియా మార్గ్ లో కలిపి రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా 19. 733 ఎకరాల భూమి ఉంది. అశోకా రోడ్డులోని 8. 726 ఎకరాల్లో ఏపీ-తెలంగాణ భవన్ ఉంది. ఉమ్మడి భవన్ లో ఏపీ వాటా 4.3885 ఎకరాలు (విలువ రూ.1,703.6 కోట్లు), తెలంగాణ వాటా 4.3375 ఎకరాలు (రూ.1,694.4 కోట్లు)గా ఉంది. 0.511 ఎకరాల రోడ్డులో రెండు రాష్ట్రాలకు చెరో 0.2555 ఎకరాలు (రూ.160 కోట్లు) ఉంది. ప్రస్తుతం తెలంగాణ కింద ఉన్న గోదావరి బ్లాక్ 4.082 ఎకరాలు (రూ.1,614.40 కోట్లు), నర్సింగ్ హాస్టల్ 3. 367 ఎకరాలు (రూ.1,318 కోట్లు) ఉంది. ఏపీ కింద ఉన్న శబరి బ్లాక్ 4.133 ఎకరాలు (రూ.1,623.60 కోట్లు), పటౌడీ హౌస్ లోని 7.640 ఎకరాలు (రూ.2,394 కోట్లు) ఉంది. శ్రీమంత్ మాధవరావు సింథియా మార్గ్ లో 7.640 ఎకరాల విస్తీర్ణంలోని పటౌడీ హౌస్ వేరుగా ఉంది.తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు అవుతున్నందున తెలుగు రాష్ట్రాలు సామరస్య పూర్వకంగా చర్చించుకొని విభజన వివాదాలను పరిష్కరించుకోవాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ రాజకీయ కారణాల వల్ల.. సమస్యలకు పరిష్కారం లభించడంలేదు. అసలు చర్చలే జరగడం లేదు. కేంద్రం పట్టించుకోవడం లేదు.