జగన్.. నిర్వేదం… పోతే…పోనీ పోరా….
సిరా న్యూస్,విజయవాడ;
సీనియర్ లీడర్ బాలినేని శ్రీనివాస రెడ్డి వైసీపీ నుంచి జనసేన వైపు వెళ్ళిపోతున్న తరుణంలో ఒంగోలులో ఇంకా చెప్పాలంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే వైసిపికి పెద్ద షాక్ తగిలింది అని అందరూ లెక్కలు వేస్తున్నారు. వైసిపి అధినేత జగన్ అయితే ఈ పరిణామంతో పూర్తిగా డీలా పడిపోతారని అందరూ భావించారు. కట్ చేస్తే జగన్ రియాక్షన్ మాత్రం వేరేలా ఉంది. నిన్న తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై ప్రెస్ మీట్ పెట్టిన ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామాపై ఎదురైన ప్రశ్నకు విచిత్రంగా రియాక్ట్ అయ్యారు.బాలినేని లాంటి సీనియర్ పార్టీ మారిపోవడంపై మీ స్పందన ఏమిటి అని అడిగితే” హూ ఈజ్ సీనియర్ ” అంటూ తిరిగి ప్రశ్నించారు. రాజకీయాల్లో సీనియర్లు ఎవరూ ఉండరని, నాయకుడు అనే వాడు ప్రజల్లో నుంచి పుడతాడే తప్ప పార్టీల నుంచి కాదని అన్నారు జగన్. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా అని వేరే పార్టీలకు వెళితే అంతిమంగా ప్రజావ్యతిరేకతలో కాలిపోతారు అన్నారు జగన్మోహన్ రెడ్డి. బాలినేనితోపాటు మరో సీనియర్ నేత సామినేని ఉదయభాను కూడా వైసిపికి గుడ్ బై చెప్పేశారు. ఒకటి రెండు రోజుల్లోనే ఇద్దరూ జనసేనలో చేరనున్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు ఎమ్మెల్సీ పోతుల సునీత లాంటి వారు వైసీపీకి బై బై చెప్పేశారు. త్వరలోనే మరికొందరు కూడా ఇదే రూట్‌లో వెళ్ళబోతున్నట్టు సమాచారం.అయితే ఇలా పార్టీ నుంచి వెళ్లే లీడర్లను పెద్దగా ఆపే ప్రయత్నం చేయడం లేదు జగన్. మళ్లీ బలం పుంజుకుంటామని ఆ రోజున ఇలాంటి నేతలు తిరిగి తమ దగ్గరకే వస్తారు అనేది ఆయన ఆలోచన కాబోలు అంటున్నాయి వైసీపీ శ్రేణులు. మొదటి నుంచి జగన్ తన పేరు మీదనే అందరూ ఎమ్మెల్యేలు అయ్యారని చెబుతూ వచ్చారు. 2024 ఎన్నికల ముందు కొన్ని ఇంటర్వ్యూలలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే చెప్పారు. తనను చూసే జనం ఓట్లు వేస్తారని తను రూపకల్పన చేసిన సంక్షేమ కార్యక్రమాలు వైసీపీని అధికారంలోకి రెండోసారి కూడా తెస్తాయని చెప్పుకొచ్చారు జగన్. అది వర్కౌట్ కాలేదు. కానీ జగన్ ఇప్పటికీ దానినే నమ్ముతున్నారు. మళ్లీ అధికారంలోకంటూ వస్తే అది తన వల్లే అనేది ఆయన నమ్మకం. అందుకే ఎవరు వెళ్ళిన ప్రస్తుతానికి పట్టించుకోవడం లేదు. అవసరమైతే కొత్త లీడర్లను తయారు చేసుకోగలనని ఆయన బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుతం వెళ్ళిపోతున్న లీడర్లు తమ పార్టీకి నష్టం చేస్తారనేదే వైసిపి థింక్ ట్యాంక్‌ను వేధిస్తున్న ప్రశ్న. కానీ పార్టీ అధ్యక్షుడు జగన్ మాత్రం ఇవేవీ పట్టించుకోవడం అనేది సామాన్య కార్యకర్త ఆలోచన. మరి ఎవరి నమ్మకం కరెక్ట్ అవుతుందో కాలమే తేల్చాలి.