సిరా న్యూస్,విజయవాడ;
విజయవాడ నగరాన్ని నాలుగు రోజులుగా వరద ముంపుకు గురి చేసిన బుడమేరు వ్యవహారంలో తప్పు ఎవరిదనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. 2005 ఆగస్ట్-సెప్టెంబర్ నెలల్లో చివరి సారి బుడమేరు వరదలు నగరాన్ని ముంచెత్తాయి. వెలగలేరు వద్ద ఉన్న బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యం సరిపోక పోవడంతో విజయవాడను వరద ముంచెత్తింది.వెలగలేరు దిగువున కొండపల్లి, కవులూరు, శాంతి నగర్, రాయనపాడు, గొల్లపూడి, షాబాద్, జక్కంపూడి మీదుగా విజయవాడ మీదకు బుడమేరు వరద ప్రవాహం ముంచెత్తింది. 2005లో ఐదారు రోజుల పాటు వరద నీటిలోనే సింగ్ నగర్ ప్రాంతం ఉండిపోయింది. విజయవాడ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో ఉన్న మురుగు నీటి డ్రైన్లను బుడమేరులోనే కలిపారు. ఈ నీరు దిగువకు కొల్లేరు వరకు ప్రవహించాల్సి ఉంటుంది.బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యం 11,500క్యూసెక్కులు మాత్రమే కావడంతో ఎగువన ఖమ్మం జిల్లాలో వర్షాలు కురిస్తే ఆ ప్రవాహాన్ని తట్టుకునే సామర్థ్యం 60ఏళ్ల క్రితం నిర్మించిన డైవర్షన్ ఛానల్‌కు లేదు. కృష్ణా నదిలో వరద ప్రవాహం ఉంటే బుడమేరు ప్రవాహాన్ని అందులోకి మళ్లించే అవకాశం ఉండదు. దిగువన విజయవాడలోకి వరద నీటిని వదలాల్సి ఉంటుంది.కృష్ణా నది వరద ప్రవాహంతో సంబంధం లేకుండా గరిష్టంగా 37,500 క్యూసెక్కుల నీటిని కృష్ణా నదిలో కలిపేలా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వెళ్లే పోలవరం కుడి కాల్వను వెడల్పు చేయాలనే ప్రతిపాదన 20ఏళ్లుగా పూర్తి కాలేదు. విటిపిఎస్‌లో ఉన్న సాంకేతిక అవరోధాలతో పాటు కృష్ణా నదిలోకి వరద ప్రవాహం వెళ్లాలంటే తక్కువ లోతు ఉండే వెడల్పాటి కాలువ నిర్మాణం చేపట్టాల్సి ఉందని 2005లోనే జలవనరుల శాఖ అధ్యయనం చేసింది.2005లో వచ్చిన బుడమేరు వరద ముంపుతో విజయవాడకు జరిగిన నష్టంతో సీపీఐ అనుబంధ అఖిల భారత కిసాన్ సంఘం ఉపాధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు పెద్ద ఎత్తున ఉద్యమించారు. దీంతో బుడమేరు ఆధునీకీరణకు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి చర్యలు చేపట్టారు. బుడమేరు ప్రవాహాన్ని పోలవరం కుడికాల్వలోకి మళ్లించడం ద్వారా ఈ సమస్యకు తాత్కలికంగా తెరపడింది.బుడమేరు ఆధునీకీకరణ ప్రారంభమైన తర్వాత విజయవాడలో ఉన్న ఆక్రమణలు తొలగించాలని నీటి పారుదల శాఖ ప్రయత్నించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న యూ టర్నింగ్‌లను తొలగించి బుడమేరకు ఆ శాశ్వత రూపం ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ భావించింది. విజయవాడ నగరంతో పాటు ఎనికేపాడు, నిడమానూరు ప్రాంతాల్లో ఉన్న మలుపుల్ని సవరించి బుడమేరును తిన్నగా వెళ్లేలా చేయాలని భావించారు. దీంతో పాటు బుడమేరు కట్టలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి కాలువను వెడల్పు చేయాలని ఇరిగేషన్ శాఖ భావించింది.బుడమేరు ఆధునీకీకరణకు 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన కంకిపాడు ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ సహకరించలేనదనే విమర్శలు ఉన్నాయి. పోలవరం కుడి కాల్వ నిర్మాణం కొలిక్కి వచ్చిన తర్వాత విజయవాడ వైపు బుడమేరు ఆధునీకీకరణ పూర్తిగా అటకెక్కించారు. బుడమేరు ఆధునీకీకరణలో జరుగుతున్న జాప్యాన్ని 2006లో దేవినేని రాజశేఖర్ తేలిగ్గా కొట్టిపారేశారు. నిధుల కొరత అంశాన్ని అప్పట్లో ప్రాజెక్టులంటే ఇన్‌స్టెంట్ కాఫీ కాదని నెహ్రూ కొట్టి పారేశారు.2009లో అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజనకు ముందు బుడమేరు ప్రవాహం అప్పటి కంకిపాడు నియోజక వర్గంలో ఉండేది. కంకిపాడు అసెంబ్లీలోనే విజయవాడ రూరల్ నియోజక వర్గంలో కొన్ని ప్రాంతాలు ఉండేవి. గుణదల ప్రాంతంలో బుడమేరు కాల్వ గట్లపై ఉన్న ఆక్రమణలు తొలగించడం, ఎనికేపాడు, నిడమానూరుప ప్రాంతాల్లో ఉన్న యూటీలను తొలగించి బుడమేరు స్వరూపాన్ని వరద ముంపు లేకుండా చేయాలంటే భూ సేకరణ చేయాల్సి వస్తుందనే కారణంతో ఆ పనులు అర్థాంతరంగా ఆపేశారు. అప్పట్లో ఈ పనుల కోసం దాదాపు రూ.8.5కోట్ల రుపాయల నిధుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినా యూటీలను సరిచేయలేకపోయారు.2009లో వైఎస్సార్ మరణం తర్వాత బుడమేరు అంశం పూర్తిగా తెరమరుగైపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు ఈ అంశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. 2014-19 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో జలవనరుల శాఖకు మైలవరం శాసనసభ్యుడు దేవినేని ఉమా నేతృత్వం వహించారు.ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం నియోజక వర్గంలోనే బుడమేరు ప్రవాహం మొదలవుతుంది.2004-09 మధ్యలో పోలవరం కుడి కాల్వ నిర్మాణం చాలా భాగం పూర్తైంది.రాష్ట్ర విభజన తర్వాత భూసేకరణ పూర్తి చేసి మిగిలిన కాలువ నిర్మాణాన్ని పూర్తి చేశారు. గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా నీటిని కృష్ణాకు తరలించారు. అదే సమయంలో బుడమేరు ఆధునీకీకరణను మాత్రం విస్మరించారు. కుడి కాల్వ సామర్థ్యాన్ని 37,500 క్యూసెక్కుల డిశ్చార్జిగా అనుగుణంగా తీర్చిదిద్దలేకపోయారు. 2019-24 మధ్య బుడమేరు అంశాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. 2010 నుంచి సింగ్ నగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బుడమేరు పరివాహక ప్రాంతంలో ఆక్రమణలు వెలియడంతో విజయవాడ నగరంలో మరో కొత్త ప్రాంతం విస్తరించింది. వేల సంఖ్యలో అపార్ట్‌మెంట్లు వెలిశాయి. 20ఏళ్ల తర్వాత దాని ఫలితాన్ని విజయవాడ ప్రజలు అనుభవిస్తున్నారు.