భారత్‌కు కొద్దిలో పతకాలు ఎందులో.. ఎవరికి దూరమయ్యాయంటే..?

సిరా న్యూస్,లండన్;
పారిస్‌ ఒలింపిక్స్‌ లో భారత్ వెంటుక్రవాసిలో కొన్ని పతకాలు కోల్పోవడం క్రీడాభిమానులను నిర్వేదానికి గురిచేసింది. అ పతకాలు కూడా భారత్‌కు వచ్చి ఉంటే పతకాల సంఖ్య ఇంకాస్త పెరిగేది. అయితే త్రుటిలో చేజారిన ఆ పతకాలు భారత రెండంకెల ఆశలను వమ్ము చేశాయి. మనూ బాకర్‌ మరో పతకం గెలిచే అవకాశాన్ని కొద్దిలో చేజార్చుకుంది.అర్జున్‌ బబుత కూడా అలాగే రజత పతకాన్ని చేజార్చుకున్నాడు. ఆర్చరీలో ధీరజ్‌-అంకిత, షూటింగ్‌లో అనంత్‌జీత్‌-మహేశ్వరి, బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్‌.. బాక్సింగ్‌లో నిశాంత్‌ దేవ్, లవ్లీనా కూడా త్రుటిలో పతకాలను చేజార్చుకున్నారు. విశ్వ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో చేజారిన పతకాలు ఏడు ఉన్నాయి. ఈ పతకాలే భారత్‌కు వచ్చి ఉంటే పతకాల సంఖ్య రెండంకెలు దాటి ఉండేది. భారత్‌కు కొద్దిలో పతకాలు ఎందులో.. ఎవరికి దూరమయ్యాయంటే..?
వినేశ్‌ ఫొగాట్‌..
ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ను తీవ్ర ఆవేదనకు గురి చేసి హృదయాన్ని ముక్కలు చేసింది ఏదైనా ఉందంటే అది భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత వేటే. కేవలం వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉందని వినేశ్‌పై వేటు పడడంతో పతకం దూరమైంది. ఇప్పుడు దీనిపై వినేశ్‌ కాస్‌లో అఫ్పీల్‌ చేసింది. తీర్పు 13న రానుంది. అదే వినేశ్‌ ఫైనల్‌ చేరితే బంగారు పతకం ఖాయమయ్యేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే
పతకం లేకుండా వినేశ్‌ నిష్క్రమించాల్సి రావడం తీవ్ర ఆవేదనను మిగిల్చింది.
మీరాబాయ్‌ చాను
మీరాబాయ్‌ చాను కూడా కాస్తలో పతకాన్ని చేజార్చుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్‌ మెడల్‌ గెలిచిన చాను… కేవలం కేజీ బరువు తేడాతో పతకాన్ని కోల్పోయింది. చాను 199కిలోలు ఎత్తి నాలుగో స్థానంతో నిలవగా… థాయ్‌లాండ్‌ లిఫ్టర్‌ సురోచన కాంబవో 200 కేజీలు ఎత్తి కాంస్యాన్ని దక్కించుకుంది. అంటే కేజీ తేడాతో భారత్‌కు పతకం చేజారిందన్నమాట.
అర్జున్‌ బబుత
విశ్వక్రీడల్లో పురుషుల 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో అర్జున్‌ బబుత కూడా వెంట్రుక వాసిలో పతకాన్ని కోల్పోయాడు. కేవలం 1.4 పాయింట్ల తేడాతో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు.
లక్ష్యసేన్‌
ఈ ఒలింపిక్స్‌లో అద్భుతంగా ఆడి పతకంపై ఆశలు రేపిన లక్ష్యసేన్‌ కీలక మ్యాచ్‌లో చేతులెత్తేశాడు. కాంస్య పతకపోరులో తొలి సెట్‌ గెలిచి మంచి ఊపు మీద కనిపించిన లక్ష్య.. ఆ తర్వాత ఒత్తిడికి చిత్తయ్యాడు. దీంతో మరో పతకం చేజారింది.
మరికొందరు కూడా..
పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మనూ బాకర్‌ కూడా మూడో పతకం సాధించే అవకాశాన్ని కొద్దిలో చేజార్చుకుంది. 25మీటర్ల పిస్టల్‌ విభాగంలో మనూ బాకర్‌ నాలుగో స్థానంలో నిలిచి మూడో పతకాన్ని చేజార్చుకుంది. యువ షూటర్లు మహేశ్వరి చౌహాన్‌, అనంత్‌జీత్‌సింగ్‌ నరుక, ఆర్చరీలో బొమ్మదేవర ధీరజ్‌, అంకిత భకత్‌, రెజ్లింగ్‌లో రితికా హుడా కూడా కొద్దిలో పతకాలు చేజార్చుకున్నారు.
==================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *