జంగా రాఘవరెడ్డి సైలెంట్ ఎందుకో

సిరా న్యూస్,వరంగల్;
కాంగరెస్‌ పార్టీ నిర్వహించే ఏ కార్యక్రమంలోనూ కనిపించని జంగా రాఘవరెడ్డి.. అనుచరులతో కూడా అంటిముట్టనట్టే ఉంటున్నట్లు తెలిసింది. దీంతో జంగా ఏం చేయబోతున్నాడనే చర్చ నడుస్తోంది.కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి 2018 ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో పోటీ చేశారు. అక్కడ బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్రావు చేతిలో ఓటమి పాలైన జంగా.. ఆ తరువాత వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆశించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏడాది ముందు నుంచే వరంగల్ వెస్ట్ లో కార్యక్రమాలు మొదలు పెట్టి, క్యాడర్ ను పెంచుకున్నారు.ఇదే తరుణంలో వరంగల్ వెస్ట్ టికెట్ ను నాయిని రాజేందర్ రెడ్డి కూడా ఆశించారు. దీంతోనే ఇద్దరి మధ్య కొంతకాలం పోటీ నడిచింది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే ఉద్దేశంతో పోటాపోటీ కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఎవరికివారు వరంగల్ వెస్ట్ టికెట్ నాదంటే నాదేనని చెప్పుకోగా.. చివరకు అది కాస్త మాటల యుద్ధానికి దారి తీసింది. డీసీసీ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న నాయిని రాజేందర్ రెడ్డి చివరకు జంగాను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కూడా ప్రకటనలు విడుదలు చేశారు. దీంతో ఇద్దరి మధ్య వైరం తారస్థాయికి చేరింది. కానీ అసెంబ్లీ ఎన్నికల టికెట్ కేటాయింపు సమయంలో అధిష్ఠానం నాయిని రాజేందర్ రెడ్డి వైపే మొగ్గుచూపింది. దాంతో జంగా రాఘవరెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యాడు.వరంగల్ వెస్ట్ టికెట్ దక్కకపోవడంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో పాటు కాంగ్రెస్ నుంచి కూడా జంగా నామినేషన్ వేశారు. ఆ తరువాత బీఆర్ఎస్ వైపు కూడా మొగ్గుచూపుతున్నాడనే ప్రచారం జోరుగానే జరిగింది. చివరకు కాంగ్రెస్ అధిష్ఠానం కలగజేసుకుని, జంగాకు సర్దిచెప్పింది.ఆయన డిమాండ్ మేరకు హనుమకొండ డీసీసీ పదవి అప్పగిస్తానని హామీ ఇచ్చింది. దీంతో జంగా పోటీ నుంచి తప్పుకున్నారు. అనంతరం కాంగ్రెస్ తరఫున పోటీలో నిలిచిన నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి ఒకట్రెండు మీటింగుల్లో పాల్గొన్నారు.జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీనే విజయం అందుకుంది. బీఆర్ఎస్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు 57,318 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన నాయిని రాజేందర్ రెడ్డి 72,649 ఓట్లు సాధించి హస్తం హవా చాటారు. దీంతో 15,331 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి విజయం సాధించారు.రాజేందర్ రెడ్డి, రాఘవరెడ్డి మధ్య ఇదివరకే వైరం నడవడం, ఆ తరువాత పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నిరాశకు గురైన జంగా.. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తరువాత ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికల్లో ఓటమి చెందిన నేతలు కూడా అడపాదడపా కార్యక్రమాల్లో పాల్గొంటుండగా.. జంగా మాత్రం నేతలు, కార్యకర్తలతో కూడా టచ్ లో ఉండటం లేదని తెలిసింది.నాయిని రాజేందర్ రెడ్డితో జత కట్టలేకే జంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడనే ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *